అసెంబ్లీకి వెళ్దాం.. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దాం :టీడీఎల్పీ భేటీలో లోకేశ్

by Seetharam |   (  Updated:2023-09-20 08:06:11  IST  )

ఈనెల 21 నుంచి జరగనున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయించింది.

Nara Lokesh
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఈనెల 21 నుంచి జరగనున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన తమ వాణిని వినిపించాలని నిర్ణయించింది.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తదనంతరం జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని టీడీఎల్పీలో పార్టీ నేతలు నిర్ణయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన జూమ్ ద్వారా టీడీఎల్పీ సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొనగా నారా లోకేశ్ ఢిల్లీ నుంచి జూమ్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. తొలుత అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై వాడీ వేడిగా చర్చించారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నారా లోకేశ్ తెలిపారు. పోరాటమే అజెండాగా టీడీపీ పనిచేయాలని లోకేశ్ సూచించారు. ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిద్దామని నారా లోకేశ్ సభ్యులకు సూచించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తోపాటు పలు ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు చట్ట సభలను వేదికగా చేసుకోవాలని ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని లోకేశ్ సూచించారు. శాసన సభ, మండలి సమావేశాలకు హాజరుకావాలని నారా లోకేశ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. చట్టసభలలో చేయాల్సిన పోరాటం అక్కడ చేద్దాం అలాగే వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేద్దామని లోకేశ్ సూచించారు. చంద్రబాబు నాయుడుపై వైసీపీ వేసిన ముద్రను తొలగించేందుకు తమ నాయకుడి అరెస్ట్ అక్రమం అని నిరూపించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఒక వేదికగా తీసుకోవాలని లోకేశ్ సూచించారు.

మైక్ ఇవ్వకపోతే పోరాటమే

అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం తమకు మైక్ ఇవ్వడం లేదని పలువురు సభ్యులు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ సభ్యులకే అత్యధిక సమయం మైక్ ఇస్తున్నారని ప్రతిపక్ష పార్టీగా తమకు మైక్ ఇవ్వడం లేదని తెలిపారు. అయితే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే నిరసనలు చేపట్టాలని సూచించారు. సభలో అవకాశం కోసం చూద్దామని ఇవ్వకపోతే జగన్ అవినీతిని ఎండగట్టేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిందేనని సూచించారు. ఇదే సందర్భంలో రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయంటున్న ప్రచారంపైనా చర్చించారు. అందుకు తగినట్లుగా అసెంబ్లీో లోపలా, బయట పార్టీ కార్యచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని లోకేశ్ దిశానిర్దేశం చేశారు. మంత్రులు కవ్వింపు చర్యలకు పాల్పడినా.. రెచ్చగొట్టినా సమన్వయంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు.

Next Story