ఏఐ సొబగులతో ‘లేపాక్షి’ హస్తకళలు

by Malleboina Mahesh |

లేపాక్షి హస్తకళలకు ఏఐ సాంకేతికతను జోడిస్తూ ఏపీ ప్రభుత్వం 'తరంగా', 'కళాక్షి' డిజిటల్ వ్యవస్థలను త్వరలో ప్రారంభించనుంది.

ఏఐ సొబగులతో ‘లేపాక్షి’ హస్తకళలు
X

దిశ, ఏపీ బ్యూరో : మన సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే హస్తకళలకు పూర్వవైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టింది. సరైన మార్కెటింగ్, ప్రాచుర్యం లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న హస్తకళాకారులను ఆదుకుంటూనే, నేటితరం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లేపాక్షి షోరూమ్‌లను ఆధునికీకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడిస్తూ, ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్డీసీ) ఆధ్వర్యంలో ‘తరంగా’ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను, ‘కళాక్షి’ వాట్సాప్ బాట్‌ను ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.

‘తరంగా’తో రియల్ టైమ్ పర్యవేక్షణ

రాష్ట్రవ్యాప్తంగా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న 19 లేపాక్షి షోరూమ్‌ల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు 'తరంగా' అనే ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ వ్యవస్థను రూపొందించారు. ఇప్పటివరకు జిల్లా అధికారుల పర్యవేక్షణలో సాగిన ఈ షోరూమ్‌ల నిర్వహణ, ఇకపై నేరుగా రాష్ట్రస్థాయి అధికారుల నియంత్రణలోకి రానుంది. ఈ వ్యవస్థ ద్వారా రోజువారీ అమ్మకాలు, సిబ్బంది పనితీరు, ఏ ప్రాంతంలో ఏ కళారూపాలకు డిమాండ్ ఉందో రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. అలాగే, సిబ్బంది పనితీరును ఏ రోజుకారోజు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.

స్టాక్ నిల్వలపై ‘స్మార్ట్ అలెర్ట్స్’

ఈ సరికొత్త ఏఐ వ్యవస్థలో 'అలెర్ట్స్' ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఏదైనా లేపాక్షి షోరూమ్‌లో హస్తకళల స్టాక్ పూర్తిగా తగ్గిపోతే 'రెడ్ అలెర్ట్', నిల్వలు తక్కువగా ఉంటే 'ఆరెంజ్ అలెర్ట్' ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం అందుతుంది. దీనివల్ల డిమాండ్ ఉన్న చోటికి తక్షణమే వస్తువులను సరఫరా చేయడమే కాకుండా, కళాకారులకు ముందస్తుగా ఆర్డర్లు ఇచ్చి వారి ఉపాధికి భరోసా కల్పించే వీలుంటుంది.

వాట్సాప్‌లో ‘కళాక్షి’ ఆర్డర్స్

ఇకపై వినియోగదారులు ఇళ్ల వద్ద నుంచే తమకు నచ్చిన హస్తకళలను ఆర్డర్ చేసుకునేలా ఈ-కామర్స్ తరహాలో 'కళాక్షి' అనే ఏఐ వాట్సాప్ లింక్‌ను తీసుకొచ్చారు. వినియోగదారులు తమ మొబైల్‌లో తెలుగు లేదా ఇంగ్లీష్‌ భాషల్లో తమకు కావలసిన వస్తువు గురించి టైప్ చేయగానే, కేవలం రెండు మూడు సెకన్లలో ఆ కళారూపం విశిష్టత, దాని వెనుక ఉన్న సంప్రదాయం, దానిని తయారు చేసిన కళాకారుడి వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. నచ్చిన వస్తువును అక్కడికక్కడే ఎంచుకుంటే నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనివల్ల హస్త కళారూపాల అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

కళాకారుల గౌరవప్రద జీవనమే లక్ష్యం

"రాష్ట్రంలో హస్తకళలకు విస్తృత ప్రాచుర్యం కల్పించి, కళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి అందించాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పం. ఏపీహెచ్‌డీసీ ఎండీ విశ్వ, వారి బృందం రూపొందించిన 'తరంగా', 'కళాక్షి' సాంకేతికతలు లేపాక్షి అమ్మకాలను సరికొత్త పుంతలు తొక్కిస్తాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా అటు కళలను కాపాడుకుంటూనే, ఇటు కళాకారుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురాగలం." – ఎస్.సవిత, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి

Next Story