రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణం.. ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

by Kema Shiva Kumar |

పోలీసుల ఆంక్షల నడుమ, పట్టిష్ట బందోబస్తుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణం.. ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసుల ఆంక్షల నడుమ, పట్టిష్ట బందోబస్తుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంటిపై దాడి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. తన పర్యటనలో అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. దారుణంగా తాను వచ్చే రహదారులను తవ్వేశారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని జగన్ ప్రశ్నించారు.

తన పర్యటన నేపథ్యంలో 2 వేల మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తన పార్టీ నేతలను కలిసేందుకు వస్తే ఆంక్షలు విధిస్తారా.. అని ఆక్షేపించారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నీ అటకెక్కాయని కామెంట్ చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా తయారైందని.. ఏపీలో ప్రస్తుత ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేయడం దారుణమని అన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు సాధారణమని.. కానీ, ఇలా ఇళ్లపై దాడులేంటని ప్రశ్నించారు. దాడులతో మనుషులన చంపుతారా అని అన్నారు. ఒకవేళ దాడి చేసిన రోజు ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే టీడీపీ మూకలు చంపేసేవారని ఆరోపించారు. ఇదే మాదిరిగా తమ వాళ్లు దాడి చేస్తే బాగుంటుందా అని వైఎస్ జగన్ అన్నారు.

Next Story