కొత్త హైవే.. పాత రికార్డులు మాయం!

by Naga Rani Yarlagadda |

ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది. బద్వేల్ టు కృష్ణపట్నం కొత్త హైవే ఏర్పడనుంది.

కొత్త హైవే.. పాత రికార్డులు మాయం!
X

దిశ ఆత్మకూరు : ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది. బద్వేల్ టు కృష్ణపట్నం కొత్త హైవే ఏర్పడనుంది. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు భూ ఆక్రమణలకు పూనుకుంటున్నారు. ఈ మార్గంలో ప్రభుత్వ, ఇతర భూములను కాజేసి సొమ్ము చేసుకునేందుకు పూనుకున్నారు. నకిలీ భూ పత్రాలను సృష్టించి అసలైన వారికి ఎసరు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేను బద్వేల్ టు కృష్ణపట్నం మధ్య రూ.3,397.46 కోట్లతో దాదాపు 108 కిలోమీటర్ల పొడువున నిర్మించనున్నారు. ఈ హైవేతో రాయలసీమ నుంచి కృష్ణపట్నం పోర్టుకు కనెక్టవిటీ ఉంటుంది. హైవే పూర్తి చేస్తే బద్వేల్-కృష్ణపట్నం మధ్య దూరం దాదాపు 34 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.. అంటే 142 కి.మీ. నుంచి 108.13 కిలోమీటర్లు అవుతుంది.ఈ గ్రీన్‌‌‌ఫీల్డ్ హైవే కడప జిల్లా గోపవరం (ఎన్‌హెచ్‌-67) నుంచి ప్రారంభమై కృష్ణపట్నం పోర్టు (నేషనల్ హైవే 16)ను కలుపుతుంది. ఇప్పటికే భూ సేకరణ కోసం రూ.255.64 కోట్లు మంజూరు చేశారు.

అయితే బద్వేల్-కృష్ణపట్నం(ఎన్‌హెచ్‌-67) జాతీయ రహదారి కొరకు మర్రిపాడు రెవిన్యూ పరిధిలో ప్రభుత్వం సేకరించిన భూములే ఇప్పుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లోని లోపాలు, అధికారుల నిర్లక్ష్యం పెట్టుబడిగా భూ ఆక్రమణ దారులు జాతీయ రహదారి వెళ్లే మార్గాన్ని గుర్తించి అక్కడ ఉండే ప్రభుత్వ పొలాల్లో తమ పేర్లను ఆన్లైన్లో ఎక్కించి టెన్ వన్, మాన్యూవల్ అడంగల్‌ను మాయం చేసి అసలు పట్టాదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్ లైన్ ముసుగులో అక్రమార్కులు సామాన్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లక్షల రూపాయల దోపిడీకి తెరలేపారు.

బద్వేల్ -కృష్ణపట్నం జాతీయ రహదారి 67 నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాత రికార్డులు మాయంచేసి రెవెన్యూ కళ్ళు గప్పి లక్షలు దోచిపెట్టడానికి మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ద్వారా జెన్యూన్ సర్టిఫికెట్ పొందడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నట్లు బహిరంగ రహస్యంగా గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. అయితే సమర్థ అధికారిగా పేరు తెచ్చుకొని మర్రిపాడు మండలంలో సామరస్య పాలన సాగిస్తున్న మండల తహసీల్దార్ భూచోరుల బాగోతం బయట పెడతారో లేదో వేచి చూడాలి.

Next Story