- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రాలయంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ప్రైవేటు బస్సుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. సాధారణంగానే మంత్రాలయం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

దిశ, మంత్రాలయం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ప్రైవేటు బస్సుల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. సాధారణంగానే మంత్రాలయం ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి తోడు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నానాటికీ ఇబ్బందులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్లీపర్ కోచ్ బస్సులు ట్రాఫిక్ లోకి వచ్చి నడి రోడ్డుపై నిలుపుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రయాణికులను ఎక్కించుకోవడంతో స్థానిక ప్రజానీకం, భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీని వల్ల పలుమార్లు భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని మంత్రాలయవాసులు చెబుతున్నారు. నడిరోడ్డులో స్లీపర్ కోచ్ బస్సులు నిలుపుదల చేసి ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, స్థానిక పోలీసు యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పట్టించుకునే నాథుడే లేడు..
ఇటీవల కర్నూలు జిల్లాలో స్లీపర్ బస్సుల కారణంగా జరిగిన నష్టం విదితమే. అలాంటి స్లీపర్ కోచ్ బస్సుల కారణంగా మంత్రాలయంలో ప్రజలు ఇబ్బందిపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నాయి. ఏకంగా పోలీసు స్టేషన్ ఎదుటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను గంటల తరబడి నిలిపి.. ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమైనా పట్టించుకునేనాథుడు కరువయ్యాడని స్థానికులు అంటున్నారు.
బాధ్యతారాహిత్యంగా ట్రావెల్స్ నిర్వహణ
మంత్రాలయంలోని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రిజర్వేషన్ చేయించుకున్న వారిని కార్యాలయాల వద్ద కాకుండా ఎక్కడపడితే అక్కడ వాహనాలను ఆపి ఎక్కించుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దాని వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఉదయం వేళల్లో కూడా బస్టాండ్ ఎదురుగా ప్రైవేట్ బస్సులను ఇష్టానుసారంగా నిలుపుతూ వాహనదారులను ఇబ్బందులు గురి చేయడం పట్ల వాహనదారుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్లీపర్ బస్సుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ స్థానిక అధికారుల పర్యవేక్షణ కొరవడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానికుడు వీరేష్ స్పందిస్తూ...
మంత్రాలయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రోడ్డుపైనే నిలిచి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో చాలాసేపు బస్సులను ఆపి ఉంచుతున్నారు. దాని వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. మాలాంటి వారు బస్సుల నుంచి వచ్చే పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. కొన్నిసార్లు రోడ్డు దాటాలంటే కూడా కష్టంగా ఉంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్లక్ష్యం కారణంగా కొన్నిసార్లు పదిహేను నిమిషాలు ట్రాఫిక్ లో నిలిచిపోతున్నాము.
చర్యలు తప్పవు : ఎస్ఐ శివాంజల్
రోడ్డు పై నిలుపుతున్న వాహనాలను ఎప్పటికప్పుడు పంపిస్తున్నాం. సిబ్బందిలేని సమయంలోనే సమస్య తలెత్తుతోంది. ఎవరైనా అకారణంగా వాహనాలను రోడ్డుపై నిలిపితే చర్యలు తప్పవు. ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయ యజమానులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలని. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.






