- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమలలో భారీ కార్చిచ్చు.. మహానంది సమీపంలో ఎగిసిపడిన మంటలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. ఆలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో అటవీ సంపదతో పాటు వన్యప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడింది. ఎండాకాలం తీవ్రతకు తోడు అడవిలో ఎండిపోయిన ఆకులు, గడ్డి నిప్పుకు ఆజ్యం పోయడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయ వెనుక భాగంలో ఉన్న దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అయితే, వేసవి గాలుల ధాటికి మంటలు అదుపులోకి రాకపోగా, అడవి లోపలికి మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి.
ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనా?
సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు. రాత్రి నుంచి అధికారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అడవిలో మంటలు చెలరేగడానికి మానవ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఎండుకర్రల కోసం అడవిలోకి వెళ్లిన వ్యక్తులు బీడీలు, సిగరెట్లు తాగి అర్పకుండా పడేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. తీవ్రమైన ఎండలు, ఎండిన ఆకులు ఉండటం వల్ల చిన్న నిప్పురవ్వ పెద్ద మంటగా మారుతుంది. అడవి లోపలికి వెళ్లేవారు నిప్పుతో కూడిన వస్తువులను తీసుకువెళ్లకూడదని, వన్యప్రాణుల రక్షణ మనందరి బాధ్యతని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.






