Kurnool: అఖిలప్రియకు కష్టకాలం.. ఈసారి టికెట్ డౌటే..!

by Disha Web Desk 16 |
Kurnool: అఖిలప్రియకు కష్టకాలం.. ఈసారి టికెట్ డౌటే..!
X

దిశ,డైనమిక్ బ్యూరో: ఒకప్పుడు టీడీపీలో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా ఆమె వెలుగొందారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు యువనేత లోకేశ్ వరకు అందరి మన్నలను పొందారు. కరోనా సమయంలో టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపించారు. ఇక టీడీపీలో ఆమెకు ఉన్న గుర్తింపు ఇక ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని అంతా భావించారు. రెండేళ్లలో సీన్ రివర్స్ అయిపోయింది. కాలం వెక్కిరించింది. ఫైర్ బ్రాండ్‌గా వెలుగొందిన ఆమె పరిస్థితి ఇప్పుడు ఒత్తిలేని చిచ్చు బుడ్డిలా తయారైంది. అది పేలడం ఎలా ఉన్న తుస్సు మని కూడా అనడం లేదు. ఇంతకీ ఆ నాయకురాలు ఎవరో తెలిసే ఉంటుంది కదూ మాజీమంత్రి భూమా అఖిలప్రియ. 2019 ఎన్నికల అనంతరం భూమా అఖిలప్రియకు కాలం కలిసిరావడం లేదు. కరోనా సమయంలో తన ఉనికిని కాపాడుకున్న ఆమె ఆ తర్వాత ఏది పట్టుకున్నా అది సక్సెస్ కావడం లేదు. వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. అంతేకాదు క్రైమ్‌లలో కూడా ఆమె ఇరుక్కోవడం చాలా మైనస్‌గా మారింది. ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భూమా అఖిలప్రియ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

2019 తర్వాత కలిసిరాని కాలం..

తల్లి మరణం అనంతరం భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తల్లి శోభానాగిరెడ్డి మరణానంతరం ఆమె ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి చేతిలో అఖిల ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం అసలు భూమా అఖిలప్రియకు కాలం కలిసి రావడం లేదు. మరోవైపు తన తండ్రి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిని చంపడానికి సుపారీ ఇచ్చారంటూ కేసు నమోదు అయ్యింది. అనంతరం హైదరాబాద్‌లో ఒక రియల్ ఎస్టేట్ వివాదంలో కొంతమందిని కిడ్నాప్ చేయించిన వ్యవహారంలో భూమా అఖిలప్రియ జైలుపాలైన సంగతి తెలిసిందే. అంతేకాదు తమ బంధువులకు ఆమె కోట్ల రూపాయల్లో బాకీ పడటం వారంతా కలిసి అఖిలప్రియ ఇంటి ముందు టెంట్ వేసుకుని మరీ ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వరుస పరిణామాలు అఖిలప్రియ ఇమేజ్‌కు డ్యామేజ్ తీసుకువచ్చింది.

అన్నీ తానై తనవరకు వచ్చేసరికి..

బెయిలుపై విడుదలైన తర్వాత భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నా ఆమె మాత్రం టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపించారు. ఇకపోతే నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కూడా అఖిలప్రియ కీలకంగా మారారు. అనంతపురం జిల్లా నుంచి లోకేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో అడుగు పెట్టినప్పుడు భూమా అఖిలప్రియ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో జరిగిన పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి భూమా అఖిలప్రియ అడుగులో అడుగు వేశారు. ఇంతలో యువగళం పాదయాత్ర కాస్త నంద్యాల నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. నారా లోకేశ్‌కు స్వాగతం పలికే విషయంలో అటు ఏవీ సుబ్బారెడ్డి ఇటు భూమా అఖిలప్రియల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఏవీ సుబ్బారెడ్డి గాయాలుపాలవ్వగా అఖిలప్రియ జైలుపాలయ్యారు. ప్రస్తుతం భూమా అఖిలప్రియ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. భూమా ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రలో అఖిలప్రియ కనిపించకుండానే పోయారు. ఇకపోతే ఆమె ఇన్‌చార్జిగా ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా లోకేశ్ పాదయాత్ర ఎంటరైంది. సొంత నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నా కనీసం పాల్గొనలేని పరిస్థితి భూమా అఖిలప్రియది. అయితే ఆమె సోదరుడు జ‌గత్‌విఖ్యాత్‌రెడ్డి మాత్రమే లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ భూమా అఖిలప్రియకు రాజకీయంగా కాలం అంతగా కలిసి రావడం లేదనేది వాస్తవం.

టికెట్ కూడా కష్టమేనా?

ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఇన్‌చార్జిగా భూమా అఖిలప్రియ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇస్తారా లేదా అన్నదానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. భూమా అఖిలప్రియ ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతానికి.. పార్టీ వాయిస్‌ను ఎంత బలంగా వినిపిస్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఈ పరిణామాలు ఆమెకు వచ్చే ఎన్నికల్లో సహకరించవని తెలుస్తోంది. ఆళ్లగడ్డ లేదా నంద్యాల ఏ నియోజకవర్గం నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేసినా ఓడించి తీరుతామని ఏవీ సుబ్బారెడ్డితోపాటు ఆయన తనయ జశ్వంతి రెడ్డి ఇప్పటికే శపథాలు చేస్తున్నారు.

మరోవైపు భూమా అఖిలప్రియ కోట్లాది రూపాయలు బాకీ పడిన నేపథ్యంలో వారంతా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తారని తెలుస్తోంది. అలాగే భూమా కుటుంబం నుంచి మరో నాయకుడు బీజేపీ తరఫున ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ అంశాలన్నీ చంద్రబాబు, లోకేశ్ దృష్టికి రావడంతో ఆమెకు టికెట్ కన్ఫర్మ్ చేసే అంశంపై కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు భూమా అఖిలప్రియకు టికెట్ ఇస్తే ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు పలువురు టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతోనే అటు చంద్రబాబు ఇటు లోకేశ్‌ ఇద్దరూ కూడా టికెట్ కన్ఫర్మ్ చేయడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Also Read...

Breaking: వైసీపీ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ.. పార్టీకి షాక్ ఇచ్చిన కేశినేని నాని


Next Story

Most Viewed