బిరబిరా పారుతున్న కృష్ణమ్మ: ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తివేత

by Disha Web Desk 21 |
బిరబిరా పారుతున్న కృష్ణమ్మ: ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తోంది. బిరబిరా పారుతున్న కృష్ణమ్మ సాగర్ ఒడిలో కలిసేందుకు పరుగులు తీస్తోంది. 12 అడుగుల గరిష్ఠ నీటి మట్టం దాటి నీరు ప్రవహిస్తోంది. బ్యారేజీ నిల్వ సామర్థ్యం 3.09 టీఎంసీలు మించి వరద నీరు ఉండడంతో అధికారులు గేట్లను ఎత్తి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి నిల్వను ఉంచుతూ దిగువకు సుమారు 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నాలుగు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు 6667 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2908 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో 7వేల క్యూసెక్కులుగా ఉంది.బ్యారేజి నుండి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇకపోతే ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటికి తోడు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయి.



Next Story

Most Viewed