Vijayawada | ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చొరవ

by Thanuru Gopichand |

ఇటీవల రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ అనేక చర్యలను చేపట్టాయి.

Vijayawada | ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక చొరవ
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ అనేక చర్యలను చేపట్టాయి. రాత్రివేళ చాలిచాలని నిద్రతో చాలా మంది డ్రైవర్లు వాహనాలను నడుపుతుంటారు. గమ్యానికి త్వరగా చేరాలనే లక్ష్యంతో నిద్రమత్తుతోనే వాహనాన్ని పరుగులు పెట్టిస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు భయంకరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. కొన్ని సంఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోతే, మరికొందరు క్షతగాత్రులై ఆసుపత్రికి చేరుతారు. ఇంకొందరు కీలక అవయవాలను కోల్పోయి క్షతగాత్రులవుతారు. ఇటువంటి దుర్ఘటనలను వీలైనంత వరకు నిలువరించి.. ప్రజల ప్రాణాలకు భరోసానిచ్చేందుకు ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు (NTR District Traffic Police) గత కొంత కాలంగా ప్రత్యేక చొరవను తీసుకుంటున్నారు. స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో (Stop, Wash, Refresh & Go) కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కార్యక్రమంలో భాగంగా ఆదివారం అర్థరాత్రి 2 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 5 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. భవానిపురం (Bhavanipuram) స్వాతి సెంటర్ వద్ద నాలుగో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామవరప్పాడు జంక్షన్ (Ramavarappadu Junction) హైవే వద్ద వాహనాలను నిలిపారు. డ్రైవర్లకు ముఖం కడుక్కునేందుకు నీటిని అందించారు. కాసేపు వారికి విశ్రాంతిని కల్పించారు. ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు తగిన నిద్ర ఉండేలా చూసుకోవాలన్నారు. నిద్రమత్తు వస్తే ముఖాన్ని తరచూ కడుక్కుంటూ ఉండాలన్నారు. టీ, కాఫీ వంటివి తాగడం ద్వారా నిద్రను నియంత్రించుకునే ప్రయత్నం చేయాలని డ్రైవర్లకు సూచించారు. తద్వారా కేవలం వారి భద్రతనే కాకుండా రహదారిపై ప్రయాణిస్తున్న ఇతరుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన వారవుతారని అన్నారు.

Next Story