‘శక్తి’గా మారిన సమయస్ఫూర్తి.. ఆటో డ్రైవర్ చెర నుంచి యువతిని రక్షించిన పోలీసులు

by Ramesh Naini |

‘శక్తి’ యాప్ ద్వారా అందిన సమాచారంతో మంగళగిరి గ్రామీణ పోలీసులు.. ఓ కామాంధుడైన ఆటో డ్రైవర్ చెర నుంచి యువతిని సురక్షితంగా రక్షించారు.

‘శక్తి’గా మారిన సమయస్ఫూర్తి.. ఆటో డ్రైవర్ చెర నుంచి యువతిని రక్షించిన పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అర్ధరాత్రి వేళ ఓ యువతిపై జరగాల్సిన ఘోరాన్ని ఆమె సమయస్ఫూర్తి, పోలీసుల సత్వర స్పందన అడ్డుకున్నాయి. ‘శక్తి’ యాప్ ద్వారా అందిన సమాచారంతో మంగళగిరి గ్రామీణ పోలీసులు.. ఓ కామాంధుడైన ఆటో డ్రైవర్ చెర నుంచి యువతిని సురక్షితంగా రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి అర్ధరాత్రి విజయవాడ బస్టాండ్‌కు చేరుకున్న ఓ యువతిని.. ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి తన ఆటో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, మంగళగిరి దాటిన తర్వాత చినకాకాని సమీపంలో ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు.

ఆపదలో ఉన్న యువతి ఎంతో సమయస్ఫూర్తితో తన ఫోన్‌లోని ‘శక్తి’ యాప్ ద్వారా పోలీసులకు అలర్ట్ పంపింది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన మంగళగిరి గ్రామీణ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన ఆటో డ్రైవర్‌ను ఎస్.ఐ. వెంకట్ వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం, పోలీసులు ఆ యువతిని సురక్షితంగా ఆమె స్వస్థలానికి చేర్చారు.

Next Story