పేదలకు గుడ్ న్యూస్.. ఇళ్ల నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

ప్రతి పేద వాడికి సొంతింటి కలను సాకారం చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు కరగ్రహారంలో గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు...

పేదలకు గుడ్ న్యూస్.. ఇళ్ల నిర్మాణంపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి పేద వాడికి సొంతింటి కలను సాకారం చేయడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు కరగ్రహారంలో గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల నాణ్యతను పరిశీలించారు. లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఇళ్ల లబ్దిదారులు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ‘‘ రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా నాడు అన్న ఎన్టీఆర్ పక్కా ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఆస్తి కల్పించేలా చర్యలు తీసుకున్నారు. కానీ.. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలను కూడా దోపిడీకి వాడుకున్నారు. ఇళ్ల స్థలాల పేరుతో ఎందుకూ పనికిరాని భూములను అధిక ధరలకు కొనుగోలు చేసి కమిషన్లు దండుకున్నారు. మెరక పేరుతో మట్టి తవ్వి దోపిడీకి పాల్పడ్డారు.’’ అని ఆరోపించారు.

‘‘మచిలీపట్నం నియోజకవర్గం కరగ్రహారంలో 300 ఎకరాల భూ సేకరణలో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఈ ప్రాంతమంతా చౌడు భూములే. రోడ్డు కంటే ఐదారు అడుగుల లోతులో భూములున్నాయి. వర్షం పడితే ఈ ప్రాంతమంతా నీటిలో మునిగిపోతుంది. అయినా పనులు చేయకుండానే కోట్లు దోచేశారు. కనీస సదుపాయాలు కల్పంచలేదు. సముద్రతీరంలోని చౌడు మట్టిని ఈ ప్రాంతానికి తరలించారు. తాగేందుకు నీరు లేవు. రోడ్లు లేవు. వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు. 13 బ్లాకుల్లో సుమారు 16 వేల ఇళ్ల స్థలాలిచ్చారు. 800 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. అయినా వంద మంది కూడా ఇక్కడకు రాలేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సుమారు 9500 ఇళ్లు డిజేబుల్ అయ్యాయి. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ఇక్కడకు రావడానికి వెనకాడుతున్నారు.’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణాల ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిచ్చింది. మంచినీటి సరఫరా, రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మిగిలిన ఇళ్లు కూడా సెప్టెంబర్‌లోపు ప్రారంభించుకోవాలి. ఇళ్ల నిర్మాణాలకు గత ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చే రూ.1.80 లక్షలు అందించి చేతులు దులుపుకుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అధనంగా అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాకుండా.. ఏడాదిలోగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అండగా నిలుస్తాం.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.

Next Story