కృష్ణాజిల్లా | నిండు ప్రాణం తీసిన నింద

by Thanuru Gopichand |

కృష్ణా జిల్లా పామర్రు శివారులోని యడదిబ్బ గ్రామంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లా | నిండు ప్రాణం తీసిన నింద
X

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లా పామర్రు శివారులోని యడదిబ్బ గ్రామంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. తనపై పడిన దొంగతనం నిందను భరించలేక పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం రాజేశ్, ధనలక్ష్మి దంపతులకు కుమారుడు కైలే యశ్వంత్ (15) ఉన్నాడు. అతను జమీదగ్గు మిలి హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. రాజేశ్ లారీ డ్రైవరుగా పనిచేస్తుండగా, తల్లి స్థానిక బేకరీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం యశ్వంత్ రోడ్డు మీద ఉన్న ఒక కుక్కను తరిమేందుకు వెళ్లాడు. ఆ క్రమంలో ఒకరి ఇంటి వైపుగా వెళ్లాడు. దీంతో సదరు ఇంటివారు అతను తమ ఇంట్లో డబ్బులు దొంగిలించాడని నిందలు వేశారు. రూ.1500లు యశ్వంత్ దొంగిలించాడని ఆరోపించారు. తమ ఇంట్లో ఏది పోయినా అందుకు అతనిదే బాధ్యత అని అనడంతో యశ్వంత్ మనోవేదనకు గురయ్యాడు. అతని తల్లిదండ్రులు డబ్బులను తిరిగి చెల్లిస్తామన్నా కూడా సదరు ఇంటివారు ఎంతకు మాట వినలేదు. సూటిపోటి మాటలతో నిందలు వేయడంతో ఆ మాటలు బాలుడి మనసును కలచివేశాయి. వారి బెదిరింపులను భరించలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

​ప్రజల ముందు జరిగిన అవమానాన్ని, బెదిరింపుల భారాన్ని భరించడం యశ్వంత్ తట్టుకోలేకపోయాడని బాలుడి తల్లిదండ్రులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. తనపై పడిన నిందను, అవమానాన్ని తలుచుకుని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడన్నారని తెలిపారు. దీనికి తోడు తన కారణంగా తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారన్న భావన యశ్వంత్‌ను మరింత కృంగదీసిందన్నారు. ఫలితంగా యశ్వంత్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నింద భరించలేక, అవమానంతోనే తన కుమారుడు చనిపోయాడని తండ్రి రాజేష్ వాపోతున్నారు. బేకరీలో పనిచేస్తున్న తల్లి ధనలక్ష్మి కుమారుడి మృతదేహంపై పడి ఏడుస్తున్న దృశ్యం అక్కడివారిని కలచివేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story