కోనసీమ ONGC ప్రమాదం.. గతంలోనూ జరిగిన ఘోరాలు

by Muthe.Rajitha |

కోనసీమ ONGC లో జరిగిన ఘోరాలు

కోనసీమ ONGC ప్రమాదం.. గతంలోనూ జరిగిన ఘోరాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం ఉదయం ONGCకు చెందిన మోరి–5 గ్యాస్ వెల్‌లో భారీ గ్యాస్ బ్లోఅవుట్‌ జరిగింది. ఈ గ్యాస్ లీక్ అయిన వెంటనే భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ గ్యాస్ వెల్‌ను ONGC తరఫున డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఘటన సమయంలో అక్కడ వర్క్‌ఓవర్ రిగ్‌తో గ్యాస్ ఉత్పత్తి పెంచే పనులు జరుగుతున్నాయి. లీకేజి జరిగిన వెంటనే పెద్ద పేలుడు శబ్దం వినిపించడంతో పాటు, మంటలు ఎగిసిపడ్డాయి. ఆకాశంలో బూడిద మేఘాలు కమ్మేయడంతో పరిసర గ్రామాల్లో తీవ్ర భయం నెలకొంది. ప్రాథమిక విచారణలో రిపేర్ పనుల సమయంలో ఫ్లేంజ్ గాస్కెట్ జాయింట్ ఫెయిల్ కావడం వల్ల గ్యాస్ లీక్ అయినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఈ ఘటన ప్రభావంతో ఇరుసుమండ, మోరి సహా సమీపంలోని మూడు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జనాభాను ఖాళీ చేయించారు. భద్రతా చర్యల్లో భాగంగా గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అలాగే భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ONGC అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం ప్రాంతాన్ని కార్డన్ ఆఫ్ చేసి, మంటలు అదుపులోకి తెచ్చేందుకు కూలింగ్ ఆపరేషన్స్ ప్రారంభించారు.

గతంలో జరిగిన దుర్ఘటనలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంతకుముందు కూడా ONGCకు సంబంధించిన ప్రమాదాలు జరిగాయి. 1995లో పాశర్లపూడిలో జరిగిన బ్లోఅవుట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఘటన. దాదాపు 200 మీటర్ల ఎత్తుకు మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించకపోయినా మంటలు ఆర్పడానికి 65 రోజులు పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2005లో కృష్ణా–గోదావరి బేసిన్‌లో ONGC ఆన్‌షోర్ వెల్ డ్రిల్లింగ్ సమయంలో భారీ బ్లోఅవుట్, అగ్నిప్రమాదం జరిగింది. తరువాత 2014లో ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన మరో ONGC డ్రిల్లింగ్ ప్రమాదంలో ఒక చీఫ్ ఇంజినీర్ మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. అదే ఏడాది మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన GAIL పైప్‌లైన్ పేలుడు ఘటనలో 23 మంది వరకు మృతి చెందగా, సుమారు 15 మంది గాయపడ్డారు. వేలాది పశుపక్ష్యాదులు, పంటలు మంటలకు ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలన్నీ గ్యాస్, పైప్‌లైన్, డ్రిల్లింగ్ పనుల్లో భద్రత ఎంత కీలకమో మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఈ ఘటనలు ONGC కార్యకలాపాల్లో భద్రతా లోపాలున్నాయనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

ONGC ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కృష్ణా–గోదావరి బేసిన్‌లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాజమండ్రి ఆసెట్ ద్వారా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి, అన్వేషణ పనులు జరుగుతున్నాయి. 2025 అక్టోబర్‌లో ONGC సుమారు రూ.7,500 కోట్ల పెట్టుబడితో ఏపీలో ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజ్ బ్లాక్‌లలో 172 ఆన్‌షోర్ వెల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని లక్ష్యం గ్యాస్, ఆయిల్ ఉత్పత్తిని పెంచడం. ప్రస్తుతం ఈ అభివృద్ధి చేస్తున్న ఇరుసుమండ గ్రామంలోని ఆయిల్ బావిలోనే బ్లో అవుట్ జరిగింది. అందులో ఉన్న గ్యాస్ అయ్యేదాకా ఆ మంటలను ఆర్పడం కష్టమేనని అధికారులు అంటున్నారు. ఏపీలో ONGC రోజుకు సుమారు 5 నుంచి 6 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్, 10 వేల బారెల్స్‌కు పైగా ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది. గ్యాస్ సరఫరాను GAIL వంటి సంస్థలకు అందిస్తోంది.

Next Story