నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-03 08:27:43  IST  )

మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులకు షాకిచ్చిన హైకోర్టు.

నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్ : నూజివీడులో (Nuziveedu) పేకాట స్థావరం నిర్వహిస్తూ.. అందుకు కోర్టు అనుమతి ఉందని బుకాయించిన మ్యాంగో బే క్లబ్ (Mango Bay Club) నిర్వాహకులకు ఏపీ హైకోర్టు (High Court) గట్టి షాకిచ్చింది. క్లబ్ లో పేకాటకు అనుమతి లేదని తేల్చి చెప్పేసింది. దీంతో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు అయ్యింది. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు తదుపరి చర్యలను ముమ్మరం చేశారు. అదే విధంగా విచారణకు క్లబ్ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.

విషయంలోకి వస్తే గతేడాది డిసెంబరు నెలలో ఏలూరు జిల్లాలోని మ్యాంగో బే రిసార్ట్ క్లబ్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అందులో పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఈ క్రమంలో తమ క్లబ్ కు అనుమతి ఉందంటూ క్లబ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తమకు కూడా అనుమతినివ్వాలని ఏలూరు పోలీసులపై భీమవరం, నరసాపురం, ఏలూరు, జంగారెడ్డి గూడెం క్లబ్స్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. తామెవరికి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసిన పోలీసులు ఆకస్మిక తనిఖీలతో మ్యాంగో బే రిసార్ట్ క్లబ్ గుట్టును బహిర్గతం చేశారు. అదే సమయంలో 285 మందిని అరెస్టు చేయడంతో రూ.34లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితులను నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పూచీకత్తుపై వదిలేశారు. విషయం హైకోర్టుకు చేరడంతో క్లబ్ కు అనుమతులు లేవని, నిర్వాహకులు పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

Next Story