కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పరిణామం.. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ ఉత్తర్వులు జారీ

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మదనపల్లె, మార్కాపురంతో పాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కొత్త జిల్లాల ఏర్పాటులో కీలక పరిణామం.. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మదనపల్లె, మార్కాపురంతో పాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి తాజాగా మూడు కొత్త జిల్లాలు ఏర్పాటుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లను సీఎస్ విజయానంద్ విడుదల చేశారు. జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ కాపీలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నేడు జరగనున్న కేబినెట్‌ సమావేశంలో కొత్త జిల్లాలపై విస్తృతంగా చర్చించనున్నారు. కొత్త జిల్లాలతో పాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం (కాకినాడ జిల్లా నుంచి), మదనపల్లె జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో ఆయా జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

కీలక మండలాలు మరో జిల్లాల్లోకి మార్పు..

ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాలు, నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు నిర్ణయంతో కొన్ని మండలాలను మరో జిల్లాలకు మారుస్తూ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను కడప నుంచి అన్నమయ్య జిల్లాకు మార్చింది. అదేవిధంగా కడప డివిజన్‌ పరిధిలో ఉన్న రాజంపేటను కలిపారు. ఇక చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలాన్ని పలమనేరు రెవెన్యూ డివిజన్‌ నుంచి చిత్తూరు డివిజన్‌లో కలిపారు. నెల్లూరు జిల్లాలోని కొండాపురం, వరికుంటపాడు మండలాలను కందుకూరు నుంచి కావలి రెవెన్యూ డివిజన్‌కు మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కలువోయ మండలాన్ని ఆత్మకూరు నుంచి గూడూరు డివిజన్‌కు.. సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరు నుంచి గూడూరు డివిజన్‌కు మార్పు చేస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కోనసీమ జిల్లాలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. ఈ 3 మండలాలను రామచంద్రాపురం డివిజన్‌ నుంచి రాజమహేంద్రవరం డివిజన్‌కు మార్చింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం రెవెన్యూ డివిజన్‌ను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Next Story