మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కస్టడీ కేసులో కీలక పరిణామం

by Thanuru Gopichand |

మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (Raghu Rama Krishna Raju) కస్టడీలో చిత్రహింసలకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

మాజీ ఎంపీ రఘురామకృష్ణ రాజు కస్టడీ కేసులో కీలక పరిణామం
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (Raghu Rama Krishna Raju) కస్టడీలో చిత్రహింసలకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1)గా అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) ఉన్నారు. కేసు నేపథ్యంలో నేడు విచారణకు హాజరుకానున్నారు. 2021లో రాజద్రోహం కేసులో రఘురామకృష్ణ రాజును సీఐడీ అరెస్టు చేసింది. తర్వాత గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కేసుకు విజయనగరం ఎస్పీ దామోదర్ విచారణాధికారిగా ఉన్నారు. గతంలోనే విచారణకు హాజరు కావాల్సిందిగా పీవీ సునీల్ కుమార్ కు నోటీసులను జారీ చేశారు. అయితే కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నారని.. ఆ దృష్ట్యా విచారణకు హాజరుకాలేనని సునీల్ కుమార్ పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు మూడు వారాల గడువు కావాలని కోరారు. అయితే అందుకు నిరాకరించిన విచారణాధికారి డిసెంబర్ 15న తప్పనిసరిగా హాజరు కావాలని మరోసారి నోటీసులను జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అప్పటి అదనపు ఎస్పీ విజయ్ పాల్ సహా మరికొందరు అధికారులు అరెస్ట్ కావడం, సునీల్ కుమార్ విచారణకు హాజరుకానుండడం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుతో..

​గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు మూడేళ్ల పాటు స్తబ్దుగా ఉన్న ఈ కేసు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన తర్వాత వేగం పుంజుకుంది. అప్పటి గుంటూరు జీజీహెచ్‌లో రఘురామకృష్ణ రాజుకు గాయాలు కాలేదని నివేదిక ఇచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయాలు ధ్రువపడటం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ నేటి విచారణకు హాజరను కానున్న నేపథ్యంలో.. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి కీలక సమాచారం బయటకు వస్తుంది, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికారులకు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సునీల్ కుమార్ వాంగ్మూలం ఈ దర్యాప్తు దిశను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

Next Story