- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
35 అజెండా అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) అధ్యక్షతన బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా మొత్తం 35 అజెండా అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా వైద్య రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ, పిడుగురాళ్ల వైద్య కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీ చేయాలని, అలాగే పలమనేరులో లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. క్రీడాకారులను ప్రోత్సహించే క్రమంలో అర్జున్ అవార్డు గ్రహీత, అథ్లెట్ జ్యోతి యర్రాజికి విశాఖపట్నంలో 500 చదరపు గజాల నివాస స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే వినూత్న ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
వీటితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పర్యాటక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ టిడ్కో (TIDCO) ప్రాజెక్టుల కోసం హడ్కో నుండి రూ. 4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారెంటీకి మద్దతు తెలిపింది. రాజధాని అమరావతిలో వీధిపోటు కారణంగా ఇబ్బందులు పడ్డ రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించింది. పర్యాటక రంగ విస్తరణలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నందకోటలో ఫైవ్ స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ మరియు థీమ్ పార్క్ ఏర్పాటుకు భూములను మంత్రివర్గం కేటాయించింది. టీటీడీలో పోస్టుల అప్‌గ్రేడేషన్, పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి దోహదపడనున్నాయి.






