నిడదవోలుకు ఆధ్యాత్మిక శోభ.. ఆలయాల అభివృద్ధికి భారీ ఊతం

by Naga Rani Yarlagadda |

నిడదవోలు నియోజకవర్గం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. పలు దేవాలయాల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.

నిడదవోలుకు ఆధ్యాత్మిక శోభ.. ఆలయాల అభివృద్ధికి భారీ ఊతం
X

దిశ, వెబ్‌డెస్క్: నిడదవోలు నియోజకవర్గంలో ఆధ్యాత్మిక అభివృద్ధికి కొత్త ఊపు వచ్చింది. ఈ ప్రాంతంలోని పుణ్యక్షేత్రాలు, దేవాలయాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో పలు ఆలయాల అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి. దీంతో నియోజకవర్గంలోని భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణం, ఆలయాల్లో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలను మంత్రి గురువారం వెల్లడించారు. ఇక సామాజికంగా వెనుకబడిన వర్గాల కాలనీల్లో భక్తి వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా భజన మందిరాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రత్యేక వేదికలు సిద్ధం కానున్నాయి.

అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పెరవలి మండలంలోని నడుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ దుర్గామాత ఆలయ అభివృద్ధికి స్థలం, నిధులు కేటాయించగా.. మల్లేశ్వరం గ్రామంలోని శ్రీ వినాయక స్వామి ఆలయానికి కూడా ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. అలాగే ఉండ్రాజవరం మండలంలోని పాలంగి గ్రామంలో ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి అవసరమైన భూమి, ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఈ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల రూపురేఖలు మారనున్నాయి. రాబోయే గోదావరి పుష్కరాలు నాటికి నియోజకవర్గంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలన్నింటినీ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు దర్శనం, పార్కింగ్, తాగునీరు, విశ్రాంతి వసతులు, పరిశుభ్రత వంటి అంశాల్లో అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా, సంప్రదాయాలకు భంగం కలగకుండా నిర్మాణాలు చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేసి భక్తులకు అంకితం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలతో నిడదవోలు నియోజకవర్గం ఆధ్యాత్మిక పర్యాటకంగా మరింత గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story