గ్రాడ్యుయేషన్ పూర్తైన మరుసటిరోజే.. భారతీయ విద్యార్థి మృతి

by Naga Rani Yarlagadda |

అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న మరుసటిరోజే భారతీయ విద్యార్థి మరణించాడు.

గ్రాడ్యుయేషన్ పూర్తైన మరుసటిరోజే.. భారతీయ విద్యార్థి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనుకున్న ఓ భారతీయ విద్యార్థి కలలన్నీ కల్లలయ్యాయి. విదేశాల్లో చదువుకుంటూ అకాల మరణం చెందుతున్న భారతీయ విద్యార్థుల జాబితాలో మరో విషాదం చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన 26 ఏళ్ల మహమ్మద్ కుమెల్ షేక్.. అమెరికాలోని కాలిఫోర్నియాలో గుండెపోటుతో కన్నుమూశాడు. విధి ఆడిన వింత నాటకంలో తన గ్రాడ్యుయేషన్ వేడుకను జరుపుకున్న సరిగ్గా ఒక్క రోజుకే ఆయన మరణించడం అందరినీ కలిచివేస్తోంది.

కుమెల్ షేక్ శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ యూనివర్శిటీలో తన చదువును పూర్తి చేశారు. మే 7న జరిగిన గ్రాడ్యుయేషన్ వాక్ వేడుకలో అతను ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆ ఆనందం మరువకముందే.. మే 8 తెల్లవారుజామున నిద్రలోనే అతనికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అప్పటివరకు స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపిన కుమెల్, నిద్రలోనే ప్రాణాలు విడవడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కుమెల్ మరణంతో అమెరికాలోని భారతీయ సంఘాలు స్పందించాయి. ఆయన భౌతిక కాయాన్ని స్వదేశానికి, కడపలోని తన ఇంటికి చేర్చడానికి నిధుల సేకరణ చేపడుతున్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా నిలవడానికి స్నేహితులు, తోటి విద్యార్థులు ముందుకొచ్చారు.

మహమ్మద్ కుమెల్ ఎంతో కష్టపడి పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. కేవలం తన కోసమే కాకుండా, తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలన్న పెద్ద లక్ష్యంతో ఆయన అక్కడికి వెళ్లినట్లు స్నేహితులు చెబుతున్నారు. కష్టపడి చదువు పూర్తి చేసి, ఉద్యోగ వేటలో పడదామనుకున్న తరుణంలోనే మృత్యువు కబళించింది. ఇటీవల విదేశాల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా యువ విద్యార్థులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. 26 ఏళ్ల వయసులోనే కుమెల్ మరణించడంపై భారతీయ విద్యార్థి సమాజంలో చర్చ మొదలైంది. పని ఒత్తిడి, మానసిక ఆందోళన లేదా ఇతర ఆరోగ్య కారణాలు ఏవైనా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Next Story