తుఫానుతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలి : డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |

కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు.

తుఫానుతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలి : డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని కాకినాడ జిల్లా (Kakinada) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓ, ఆర్డీవోలు, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతోపాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని తెలిపారు.

కాకినాడ జిల్లా పరిధిలో మొత్తం 21 మండలాలు, ఏడు మున్సిపాలిటీలు ప్రభావితం అయినట్టు కలెక్టర్ షాన్ మోహన్ వివరించారు. మొత్తం 61 ఇళ్లు దెబ్బ తినగా, 41,932 కుటుంబాలపై మొంథా ప్రభావం చూపినట్టు తెలిపారు. అందులో 27,624 మత్స్యకార, 313 చేనేత కుటుంబాలు ఉన్నట్టు చెప్పారు. 21, 711 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, 668 ఎకరాల్లో అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. మొత్తం 33,596 మంది రైతులు తుపాను కారణంగా నష్టపోయినట్టు తెలిపారు. విద్యుత్ పరికరాలు, రోడ్లు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నట్టు వివరించారు. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే వరి, ఉద్యాన పంటలు కలిపి 2,500 మంది రైతులు వరకు పంటలు నష్టపోయినట్టు చెప్పారు. అంతటా ఉపసమన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంట నష్టం అంచనాలు రూపొందించే సమయంలో రైతుల (Farmers) పక్షాన నిలచి పక్కాగా నివేదికలు రూపొందించాలన్నారు. దెబ్బ తిన్న ఇళ్లకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల వారీగా పారిశుధ్య కార్యక్రమాలు ఎంత వరకు వచ్చాయో ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సూచించారు. ఎంత మేర రోడ్లు దెబ్బతిన్నాయో గుర్తించి, పాక్షికంగా దెబ్బ తిన్న చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.

Next Story