ఎలా ఎక్కుతున్నారో చూడండి.. మా గోడు మీకు పట్టదా? : ఏపీ ఆర్టీసీ కండక్టర్ వీడియో వైరల్

by Naga Rani Yarlagadda |

ఆర్టీసీ ఉన్నతాధికారులకు తాము పడుతున్న కష్టాలేవీ కనిపించడం లేదా ? అని ఏపీఎస్ ఆర్టీసీ లేడీ కండక్టర్ వాపోయింది.

ఎలా ఎక్కుతున్నారో చూడండి.. మా గోడు మీకు పట్టదా? : ఏపీ ఆర్టీసీ కండక్టర్ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సూపర్ సిక్స్ హామీల్లో (Super Six Schemes) ఒకటైన ఉచిత బస్సు పథకాన్ని (Free Bus Scheme) ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉచిత బస్సు పథకంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటూ ఓ లేడీ కండక్టర్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన మహిళా కండక్టర్ ఉచితబస్సు పథకం తమ పాలిట శాపంలా మారిందంటూ వాపోయింది. పరిమితికి మించి ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారని, వద్దని చెప్తున్నా వినడం లేదని చెప్పుకొచ్చింది. ఒక బస్సుకు 150-170 మంది ప్రయాణికులు ఎక్కుతుండటంతో ఊపిరి కూడా తీసుకోలేనంత దారుణంగా పరిస్థితి ఉంటోందని చెప్పుకొచ్చిందామె.

ఆర్టీసీ ఉన్నతాధికారులకు తాము పడుతున్న కష్టాలేవీ కనిపించడం లేదా ? అని ప్రశ్నించింది. ప్రయాణికులు కండక్టర్లకు సహకరించడం లేదని, డోర్లలో నుంచి పైకి రమ్మంటే నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారని తెలిపింది. తమ ఉద్యోగాలు.. రోడ్లపై ఉండే పాకీవాడికన్నా హీనంగా తయారయ్యాయని గగ్గోలు పెట్టింది. బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ పై తిరగబడటం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, మీరిచ్చే జీతాలకంటే మేం ఎక్కువే కష్టపడుతున్నామని చెప్పింది. ఇంత చేస్తున్న మాపై అధికారులెవరికీ జాలి లేదా? ప్రయాణికులు పరిమితికి మించి బస్సులు ఎక్కడంపై చర్యలు తీసుకోవాలని కోరింది.

లేడీ కండక్టర్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. అధికారులు ఆమెపై చర్యలు చేపట్టారు. ఆమెపై విచారణకు ఆదేశించారు. తాజాగా సదరు కండక్టరుకు విధులు కేటాయించకపోవడంతో.. సహచర కండక్టర్లు అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Next Story