జెన్ జీ యువత కోసం జనసేన ‘సేనాగళం’: పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

by Ramesh Naini |   (  Updated:2026-05-31 17:05:44  IST  )

జనసేన పార్టీని నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు, నేటి యువత గళాన్ని బలంగా వినిపించే లక్ష్యంతో ‘సేనాగళం’ పేరిట ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.

జెన్ జీ యువత కోసం జనసేన ‘సేనాగళం’: పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన పార్టీని నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు, నేటి యువత (Gen Z) గళాన్ని బలంగా వినిపించే లక్ష్యంతో ‘సేనాగళం’ పేరిట ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. నూతనంగా ఏర్పాటైన ఈ కమిటీ సభ్యులకు ఆయన పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.

కుల రాజకీయాలకు స్వస్తి..

బూజుపట్టిన బూర్జువా విధానాలకు స్వస్తి పలికి, అభ్యుదయ భావాలతో కమిటీలు ముందుకు సాగాలి. రాజ్యాంగానికి కట్టుబడి, దేశ సమగ్రతకు భంగం కలగకుండా, అన్ని వర్గాలను గౌరవిస్తూ పని చేయాలి. ఒక కులం వారిని అదే కులం వారితో తిట్టించే వికృత రాజకీయ ధోరణికి సమాజంలో ముగింపు పలకాలి. కొందరు తమ వ్యక్తిగత తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కులం, మతం, ప్రాంతీయత ముసుగు వేసుకుని దాక్కుంటున్నారని, ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పవన్ పేర్కొన్నారు.

జనసేన విధానం ఇదే..

వ్యక్తుల తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప, ఆ వ్యవహారంలోకి సామాజిక వర్గాలను లాగి విద్వేషాలు రెచ్చగొట్టకూడదన్నదే జనసేన స్పష్టమైన విధానమని ఆయన ఉద్ఘాటించారు. రాజకీయ పార్టీగా పూర్తి సామాజిక బాధ్యతతో జనసేన ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Next Story