పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కోసం జలహారతి కార్పోరేషన్.. చైర్మన్, వైస్ చైర్మన్లు వీరే..

by Ramesh Goud |   (  Updated:2025-04-08 15:36:55  IST  )

చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కోసం జలహారతి కార్పోరేషన్.. చైర్మన్, వైస్ చైర్మన్లు వీరే..
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (Polavaram-Banakacharla Link Project) కోసం జలహారతి కార్పోరేషన్ (Jalaharati Corporation) ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం ప్రకారం వంద శాతం ప్రత్యేక వాహక సంస్థగా ఈ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్పోరేషన్ చైర్మన్ గా సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఉండగా.. వైస్ చైర్మన్ గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఉండనున్నారు.

అలాగే ఈ కార్పోరేషన్ సీఈవోగా జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు. గోదావరి బేసిన్ లో వృధాగా పోతున్న వరద జలాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించింది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ నుంచి బనకచర్ల లింక్ ద్వారా వరద జలాలను తరలించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. ఈ ప్రాజెక్టుతో 80 లక్షల మందికి త్రాగు నీరు అందించడమే గాక.. కొత్తగా 3 లక్షల హెక్టార్లు సాగులోకి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో మొత్తం 9.14 లక్షల హెక్టార్లకు నీరు అందించడంతో పాటు 20 టీఎంసీల మేర పరిశ్రమలకు ఇవ్వచ్చని తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 80,112 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టును పల్నాడు జిల్లా బొల్లపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యలేటర్ వరకు నీటిని తరలించేలా ప్లాన్ చేశారు. దీంతో లోటు ఉన్న ప్రాంతాలకు 15 టీఎంసీల వరకూ తరలించే ఆస్కారం ఉంటుందని, తీవ్ర వర్షాభావ ప్రాంతాలైన రాయలసీమ వంటి జిల్లాలకు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం నల్లమల్ల నుంచి నీటిని కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సొరంగాల ద్వారా తరలించాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టును తీర్చిదిద్దాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తో్ంది.

Next Story