బీసీ ఉద్దారకుడిని అని చెప్పుకోవడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి: మాజీమంత్రి కొల్లు రవీంద్ర

by Disha Web Desk 21 |
kollu ravindra
X

దిశ , డైనమిక్ బ్యూరో : ‘వెన్ను విరిచి వీల్ ఛైర్ ఇచ్చాను. నన్ను మించిన ధాన కర్ణుడు లేదు అన్నట్లుంది జగన్ రెడ్డి వైఖరి’ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాల వారిని అణగదొక్కి, అవమానాలకు గురిచేసి, చేదోడుతో చిల్లర విదిల్చి నా వల్లే మీరంతా బతుకుతున్నారన్నట్లు వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు. రాష్ట్రంలో ప్రజాసాధికార సర్వే ప్రకారం 13 లక్షలకు పైగా టైలర్లు, 5.50 లక్షల నాయీ బ్రాహ్మణులు, 11.63 లక్షల మంది రజకులు ఉన్నారు. కానీ చేదోడు అంటూ జగన్ రెడ్డి బటన్ నొక్కేది 3.25 లక్షల మందికే. మిగిలిన 17 లక్షల మందికి ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.


చిల్లర విదుల్చుతూ మహాప్రసాదమంటారా?

టీడీపీ హాయాంలో నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు గ్రూప్ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఆదరణ కింద పనిముట్లు అందించాం అని మాజీమంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణులకు బ్యుటీషియన్, ఇతర కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చాం. సెలూన్లకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం అని గుర్తు చేశారు. టైలర్లకు ఉచితంగా ఎలక్ట్రిక్ కుట్టు మిషన్లు, ఇతర పనిముట్లు అందించామన్నారు. కానీ జగన్ రెడ్డి వచ్చాక అన్నీ రద్దు చేసి వారికి చిల్లర విదుల్చుతూ అదే మహాప్రసాదం అనుకోమనడానికి సిగ్గుపడాలి అని విమర్శించారు. గతంలో టీటీడీ చైర్మన్ బీసీ, ఏపీఐఐసీ చైర్మన్ బీసీ, తుడా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లాంటి రాష్ట్ర స్థాయి చైర్మన్లు, 12 యూనివర్శిటీల్లో 9 యూనివర్శిటీ వీసీలు బీసీలు అని గుర్తు చేశారు. సలహాదారులుగా, ఇతర పదవుల్లో బీసీలకు అగ్రతాంబూలం అందేదని కానీ, నేడు ఎన్ని పదవుల్లో బీసీలున్నారు? కనీసం బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వతంత్రంగా నిర్ణయాలు కూడా తీసుకోనీయకుండా సొంత వర్గం వారితో అణగదొక్కుతున్నారు అని చెప్పుకొచ్చారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదేనా బీసీలకు తోడుగా నిలవడం. ఇదేనా బీసీలకు పదవులివ్వడం? అని ప్రశ్నించారు. బీసీలకు చెందిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. స్థానిక సంస్థల్లో బసీలకు ఎన్టీఆర్, చంద్రన్న ఇచ్చిన రిజర్వేషన్లను 34% నుండి 24%కి కుదించి 16,800 రాజ్యాంగబద్ద పదవులు దూరం చేశారు అని విమర్శించారు. బీసీలకు చెందిన 8వేల ఎకరాలు లాక్కున్నారు. విదేశీ విద్య, స్టడీ సర్కిల్స్, స్కిల్ డెవలప్‌మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి విద్యా పథకాలు, ఆదరణ లాంటి ఆర్ధికాభివృద్ధి పథకాలు సహా 30 బీసీ పథకాలు రద్దు చేశారు అని మండిపడ్డారు. 70 మందిని హత్య చేశారు. 1500 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. 2500 మందిపై దాడులకు పాల్పడ్డారు. కార్పొరేషన్లకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు. బీసీ భవనాలు కమ్యూనిటీ హాళ్లు నాశనం చేశారు. ఇన్ని రకాలుగా బీసీలను దగా చేసి ఇంకా బీసీ ఉద్దారకుడిని అని చెప్పుకోవడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed