జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంది: నారా లోకేష్

by Disha Web Desk 21 |
జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంది: నారా లోకేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మూడే మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఇక సీఎం జగన్ పని అయిపోయింది. వచ్చేది మన ప్రభుత్వమే అనడానికి.. ఏపీలో పనిచేసే అధికారులు ఢిల్లీకి క్యూ కట్టడమే నిదర్శనం’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని చెప్పుకొచ్చారు.‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నారా లోకేశ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న అధికారుల వెన్నులో వణకు పుడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని అర్థమవ్వడంతో అధికారులు ఢిల్లీకి క్యూ కడుతున్నారని చెప్పుకొచ్చారు. డిప్యూటేషన్‌పై రాష్ట్రం నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఏ అధికారిని వదిలిపెట్టేది లేదని.. ఢిల్లీ కాదు కదా ఎక్కడ దాక్కున్నా అరెస్ట్ చేసి శిక్ష పడేవరకు ఊరుకునేది లేదని లోకేశ్ వెల్లడించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు కలవకూడదని వైఎస్ జగన్ అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయితే స్కిల్ స్కాం కేసులో అక్రమంగా అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారని.. ఇలాంటి అక్రమ కేసులను సహించకూడదనే ఉద్దేశంతో పొత్తు విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారని లోకేశ్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధ్యాయులను సైతం ప్రభుత్వం భయపెడుతుందని మెమోలు ఇస్తూ వేధిస్తున్నారని అన్నారు. మూడు నెలలు ఓపికపట్టాలని మీరంతా నమ్మే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని మీకు అండగా నిలుస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.

ఆత్మలతో మాట్లాడే వ్యక్తి జగన్‌

తెలుగుదేశం పార్టీని భయపెట్టాలని వైసీపీ చేసిన ప్రయత్నాలు వికటించడంతో వారిలో ఆందోళన నెలకొందన్నారు. టీడీపీని బలహీనపరిచే కుట్రలో భాగంగానే చంద్రబాబుపై కేసులు పెట్టారని.. అలాగే తనపై కూడా అక్రమ కేసులు బనాయించారని లోకేశ్ ఆరోపించారు. తమది అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదని లోకేశ్ వివరణ ఇచ్చారు. బాంబులకే భయపడని వాళ్లం కోర్టులు, కేసులకు భయపడతామా అని ప్రశ్నించారు. అంతేకాదు తన పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు చాలా ప్రయత్నాలు చేశారని చెప్పుకొచ్చారు. పిల్ల సైకోలు తనను ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని ఎద్దేవా చేశారు. ఇకపోతే విషపూరితమైన మద్యంను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమ్ముతూ డబ్బులు దోచుకుంటున్నాడని లోకేశ్ ఆరోపించారు. నకిలీ మందును అమ్ముతున్న పాపం జగన్‌రెడ్డిని ఊరికే వదిలిపెట్టదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. వైసీపీ పాలనలో పేదలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. పేదల కడుపుమంటలే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చితికి మంటలుగా మారుతాయని నారా లోకేశ్ వెల్లడించారు.

ఒకటో తేదీకే ఉద్యోగులకు జీతాలు

రాష్ట్రంలో నిశబ్ధ యుద్ధం జరగబోతుందని నారా లోకేశ్ వెల్లడించారు. రాజకీయ చరిత్రలోనే 100 సంక్షేమ పథకాలను కట్‌ చేసిన ఏకైక వ్యక్తి జగన్‌‌రెడ్డి అని చెప్పుకొచ్చారు. విద్యుత్ చార్జీలు, చెత్త చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర వస్తువుల చార్జీలు పెంచుతూ ఏపీలో జగన్‌రెడ్డి బాదుడే బాదుడుతో ముందుకెళ్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని... నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని నారా లోకేశ్ ప్రకటించారు. దళితులకు రావాల్సిన 27 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని... టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100రోజుల్లోనే రద్దు చేసిన 27 పథకాలను అమల్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. జీపీఎస్‌ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగులను మోసం చేశారని...జీతాలు కూడా సకాలంలో వేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

దళితులను ఊచకోత కోస్తూ రాక్షసానందం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీ మీటింగ్‌లోనూ నా ఎస్సీలు, నా బీసీలు అంటూ కపట ప్రేమను ఒలకబోస్తున్నారని జగన్ ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించే దళితులను ఊచకోత కోస్తూ రాక్షసానందం పొందుతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముమ్మిడివరం నియోజకవర్గం పల్లెపాలెం సెంటర్‌లో యువనేత లోకేశ్‌ను దళితులు కలిశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి, దళితుల సాధికారితను దెబ్బతీసింది అని లోకేశ్‌కు తెలిపారు. నాలుగున్నరేళ్లలో 6వేలమంది దళితులపై అక్రమకేసులు పెట్టి, 21మందిని హత్యచేసిన జగన్ ప్రభుత్వంపై జ్యుడీషియల్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేయడమేగాక రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి తీరని అన్యాయం చేసిందని ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్‌కు భారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సర్కారు రద్దు చేసిన 27న ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. దళితులను వేధించిన వైసీపీ నేతలు, పోలీసులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed