నడిరోడ్డుపై సభ్యుడి కిడ్నాప్.. ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ: వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు

by Ramesh Naini |

చిన్న ఎంపీపీ ఎన్నికల్లోనే ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేస్తూ, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బలప్రదర్శన వేదికగా మార్చారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

నడిరోడ్డుపై సభ్యుడి కిడ్నాప్.. ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ: వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్న ఎంపీపీ ఎన్నికల్లోనే ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేస్తూ, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బలప్రదర్శన వేదికగా మార్చారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ ఎంపీటీసీలను ఓటు వేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా నడిరోడ్డుపై అడ్డుకుని దాడులు చేశారని జగన్ ఆరోపించారు. ఈ ఘటనలో ఓ మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా, మరో సభ్యుడిని కిడ్నాప్ చేసి, ఇంకొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. భయాందోళన సృష్టించి బలప్రయోగంతో ఓటు హక్కును అడ్డుకోవడమే వెనుక ఉన్న ఏకైక ఉద్దేశమని ఆయన విమర్శించారు. ఇలాంటి వేళల్లో పోలీసులు అధికార పార్టీకి బహిరంగంగా మద్దతిస్తూ కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడటంలో విఫలమవుతున్నారని జగన్ అన్నారు.

వైసీపీ ఎంపీటీసీల నిర్బంధం

అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలంలోనూ వైసీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా నిలబడి, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిల్చి ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేయడం, బహిరంగ దాడులు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకోవటం కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైందని జగన్ ఆరోపించారు. దేశానికి ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ప్రభుత్వ అధికార దుర్వినియోగం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిందో స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story