జ‌గ‌న్ 2.౦..! ఓట‌మి బాధ నుంచి పుంజుకున్నమాజీ సీఎం

by Ramesh Goud |

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ 2.0 ఉత్సాహం.. ఉల్లాసం చూసి వైసీపీ కేడ‌ర్ ఆశ్చ‌ర్య పోతోంది.

జ‌గ‌న్ 2.౦..! ఓట‌మి బాధ నుంచి పుంజుకున్నమాజీ సీఎం
X

దిశ‌, ఏపీబ్యూరో : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ 2.0 ఉత్సాహం.. ఉల్లాసం చూసి వైసీపీ కేడ‌ర్ ఆశ్చ‌ర్య పోతోంది. లిక్క‌ర్ స్కాంపై కూట‌మి స‌ర్కార్ వేసిన సీఐడీ, సిట్‌ల‌కు భ‌య‌ప‌డ‌ట్లేదు, కేసులు, అరెస్టుల గురించి ప‌ట్టించుకోవ‌ట్లేదు. పార్టీ వ‌దిలి వెళుతున్న వారికి టాటా చెబుతున్నారు. వ‌స్తున్న వారికి శాలువాల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లతో వ‌రుస‌ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ప‌నితీరుపై క్లాస్ పీక‌డం కాకుండా స‌ర‌దాగా ఛ‌లోక్తులు విసురుతున్నారు. రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారంలోకి మ‌న‌మే వ‌స్తాం .. ప్ర‌త్య‌ర్ధుల భ‌ర‌తం ప‌డ‌దామంటూ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రెస్‌మీట్లు పెట్టి మ‌రీ ముఖ్యంగా తెలుగు మీడియాతో కూడా ముచ్చ‌టిస్తున్నారు. అల్ల‌ర్లు, ప్ర‌మాదాలు జ‌రిగిన ప్రాంతాల‌కు స్వ‌యంగా వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు, మ‌రోవైపు పార్టీనేత‌ల ఇళ్ల‌ల్లో పెళ్లిళ్ల‌కు ఫంక్ష‌న్ల‌కు హాజ‌ర‌వుతూ రాష్ట్ర‌మంతా జ‌గ‌న్ 2.0 మార్క్ చూపిస్తున్నారు.

అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం..

2014-2019 జ‌గ‌న్ 1.0 ప్ర‌తిప‌క్ష‌నేత‌కు, 2.0కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నిక‌ల్లో ఎదురైన‌ అనూహ్య ఫ‌లితాలతో జ‌గ‌న్ బాగా డీలా ప‌డ్డార‌ని, ఆ బాధ నుంచి ఇంత త్వ‌ర‌గా కోలుకుంటార‌ని ఊహించ‌లేద‌ని చెబుతున్నారు. 151 నుంచి 11 సీట్ల‌కు ప‌డిపోయినా, ఆ ఘోర ప‌రాజ‌యం నుంచి త్వ‌ర‌గా కోలుకున్నారని అంటున్నారు. సీఎంగా జ‌గ‌న్ బిజీగా ఉన్న స‌మ‌యంలో నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు త‌గిన స‌మ‌యం కేటాయించ లేకపోయార‌ని, ఆ లోటు ఇప్పుడు భ‌ర్తీ చేస్తున్నార‌ని సంబ‌రప‌డుతున్నారు. పార్టీ నుంచి ఎంత పెద్ద లీడ‌ర్ బైట‌కు వెళ్లినా డోంట్ కేర్ అన‌డం, కూట‌మి ప్ర‌భుత్వం అరెస్టుల హెచ్చ‌రిక‌ల‌కు లొంగ‌కపోగా, ఇప్ప‌టికే 16 నెల‌లు జైల్లో ఉండి వ‌చ్చిన వాడిని, మ‌హా అంటే ఇంకో మూడు నెల‌లు జైల్లో వేస్తారు.. ఏమైత‌ది బైట‌కు రామా.. రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేయ‌మా అంటూ డైలాగ్స్ చెప్ప‌డం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది. కాగా, ఉత్త‌రాంధ్ర ఇన్‌ఛార్జ్ గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో ఆ పోస్టును మరో కీల‌క‌ నేత‌తో భ‌ర్తీ చేసేందుకు జ‌గ‌న్ క‌స‌రత్తు చేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఓ ఫైర్ బ్రాండ్ నేత‌ను అక్కడ ఇన్‌చార్జ్ గా నియ‌మించ‌బోతున్నార‌ని అంటున్నాయి.

Next Story