కాశీబుగ్గ తొక్కిసలాట వెనుక కుట్రకోణం? అసలు కారణం ఎవరు?

by Naga Rani Yarlagadda |

కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక కుట్రకోణం ఉందా? ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు..

కాశీబుగ్గ తొక్కిసలాట వెనుక కుట్రకోణం? అసలు కారణం ఎవరు?
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఊహించని రీతిలో భక్తులు అక్కడికి రావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తేలింది. అసలు అంతమంది భక్తులు ఒకేసారి అక్కడికి ఎలా వచ్చారు? ఒక పొలిటికల్ పార్టీకి అంతమందిని సమీకరించడం చాలా పెద్ద పని. కానీ.. దాదాపు 20 వేల నుంచి 25 వేల మంది భక్తులు ఒక ఆలయానికి ఒకే రోజు రావడం వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా? ఎవరైనా ఇది కావాలని చేయించారా?

రాష్ట్రంలో ఎక్కడ, ఎప్పుడు, ఏం జరిగినా అక్కడికి వచ్చిన వ్యక్తులదో, నిర్వాహకులదో తప్పని ఒక ముద్ర వేసేస్తున్నాం. మనరాష్ట్రంలోనే కాదు.. పక్క రాష్ట్రాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనల్లోనూ అక్కడికి వచ్చిన సెలబ్రిటీలది, రాష్ట్ర ప్రభుత్వాలది తప్పు అని చెప్తున్నాం. కానీ మన ఆలోచన ఏమైంది? కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం ఏమీ పురాతన ఆలయం కాదు. ఈ ఏడాది మే నెలలోనే ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పేరుకు 12 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించారని చెప్తున్నారు కానీ.. పాతికవేలమంది భక్తులను మేనేజ్ చేసే సిస్టమ్ మాత్రం లేదు. పైగా ఆలయం ఫస్ట్ ఫ్లోర్లో ఉండటంతో మెట్లెక్కి వెళ్లాలి. ఆ మెట్ల పక్కన ఏర్పాటు చేసిన రెయిలింగ్ టెంపరరీగా పెట్టినది కావడంతో.. భక్తుల తోపులాటకు అదికాస్తా విరిగిపోయింది. రూ.20 కోట్ల వ్యయంతో కడుతున్న ఆలయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదా ? అనేందుకు ఇదొక్కటి చాలు.

ఇక ఆలయానికి ఇంత పెద్దఎత్తున భక్తులు తరలి రావడానికి కారణం ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు చదివేది నిజమే. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆలయ నిర్మాణం, స్వామివారి దర్శనం గురించి ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్స్ లో చేసిన రీల్సే.. అంతమంది భక్తుల్ని ఆలయానికి రప్పించాయనడంలో సందేహం లేదు. పెద్దఎత్తున ఆలయం గురించి ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రచారం చేయడం, కార్తీక శనివారం, పైగా ఏకాదశి కూడా కావడంతో.. ఈరోజు దర్శించుకుంటేనే పుణ్యం వస్తుంది, రేపు వెళ్తే రాదన్నట్టుగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తి ఉండొచ్చు కానీ.. మరీ ఈ స్థాయిలోనా?. విశేషమైన రోజుల్లో ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటే మంచిదన్న నమ్మకాలను కొట్టిపారేయలేం. కానీ.. కాశీబుగ్గలో గానీ, శ్రీకాకుళం జిల్లాలో గానీ ఆ ఒక్క వేంకటేశ్వరస్వామి ఆలయమే ఉందా? అక్కడికే వెళ్లాలనుకుంటే మామూలు రోజుల్లో కూడా వెళ్లి ఉండొచ్చు. పోనీ దర్శనం నిదానంగా జరుగుతుందని ఓపిక పడతారా అంటే.. అదీ లేదు. ఎవరికి వారికే దర్శనం త్వరగా అయిపోవాలి. ఇందుకోసం తోసుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రమాదానికి ఒక కారణం ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మరోకారణం ఆ ఆలయ నిర్వాహకులు. క్రౌడ్ ను మేనేజ్ చేయలేక చేతులెత్తేశారు. ఇన్ఫ్ల్యూయెన్సర్స్ చేసిన ప్రచారంతో భక్తులు పెద్దఎత్తున వస్తారని వారికి తెలియదా? ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాక.. మేం అంచనా వేయలేకపోయామని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే ఆలయంలో రాకపోకలు ఒకవైపు నుంచే జరుగుతున్నాయి.

మరోవైపు వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇది ప్రభుత్వ వైఫల్యమని, పోలీసులు అక్కడ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రైవేటు ఆలయంలో పోలీసుల భద్రత కల్పించాలంటే ఆ ఆలయ నిర్వాహకులు ప్రభుత్వానికి ముందుగానే విజ్ఞప్తి చేసుకోవాలి. ఓ పక్క ఆలయ నిర్వాహకులు తాము ప్రభుత్వానికి రద్దీపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెప్తుంటే.. సీదిరి అప్పలరాజు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పైగా తొక్కిసలాట జరిగిన కొద్దిసేపటికే ఆయన అక్కడికి చేరుకుని సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమని, వైసీపీ నేతలు ఇలా చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని మేథావులు అంటున్నారు.

ఇది కావాలని చేయించిన కుట్రకోణమా? లేక ప్రమాద వశాత్తుగానే జరిగిందా? అన్నదానిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, నిజనిజాలు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందంటున్నారు. ఇక ఇన్ఫ్ల్యూయెన్సర్స్ కూడా ఏ విషయాన్నైనా ప్రచారం చేసేటపుడు అక్కడి కెపాసిటీ కూడా చెప్పాలి. ఎక్స్‌ప్లోర్ చేస్తున్న ప్లేస్ చాలా విశాలంగా ఉంది, అద్భుతంగా ఉంది అంటే.. ఇదిగో రిజల్ట్ ఇలాగే ఉంటుంది. రెస్టారెంట్లు, పార్కులు, పబ్బులు, ఫుడ్ కోర్టులు, షాపింగ్స్, టెంపుల్స్, రిసార్ట్స్,.. అబ్బో ఒకటేంటి.. అన్ని ప్లేసుల్నీ రీల్స్ లో ఎక్స్‌ప్లోర్ చేయడం, వాటిని చూసిన జనాలు ఒకేసారి అక్కడికి ఎగబడి వెళ్లడమే ఇలా ప్రాణాలమీదికి తీసుకొస్తుంది. ఇకనైనా ఈ విషయాన్ని గ్రహించండి.

Next Story