- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంధన అక్రమాలపై ఉక్కుపాదం.. పక్కదోవ పట్టిస్తే కఠిన చర్యలే : మంత్రి నాదెండ్ల
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత, బంకుల నిర్వహణపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత, బంకుల నిర్వహణపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంధనాన్ని పక్కదోవ పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించే బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. బంకుల్లో స్టాక్ ఉంచుకుని కూడా, వాహనదారులకు ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి ఇబ్బంది పెట్టే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇంధన లభ్యతను దృష్టిలో ఉంచుకుని బంకుల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న ‘రేషన్ పద్ధతి’ని ఇలాగే కొనసాగించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆక్వా, వరి సాగు చేస్తున్న రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం ఎలాంటి ఇంధన కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సోషల్ మీడియా వేదికగా ఇంధన కొరతపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిని గుర్తించి వెంటనే కేసులు నమోదు చేయాలని పోలీసు, సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
1967 టోల్ ఫ్రీ నెంబర్
ఇంధనం పోయడానికి నిరాకరిస్తున్న బంకులపై టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ ఫిర్యాదులపై జిల్లా స్థాయి అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులతో పోలిస్తే రాష్ట్రంలో బంకుల మూసివేత గణనీయంగా తగ్గిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా వెల్లడించారు. చమురు కంపెనీల నుంచి ఇంధన సరఫరా కూడా మెరుగుపడిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.






