ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థి బలవన్మరణం... కుటుంబ సభ్యుల ధర్నా

by Thanuru Gopichand |

ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థి బలవన్మరణం... కుటుంబ సభ్యుల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలో (Tirupati) విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి (Upparapalli) వద్ద ఉన్న బీఎస్సార్ (BSR) జూనియర్ కాలేజీలో తులసి రెడ్డి (Tulasi Reddy) అనే విద్యార్థి ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. అతను బలవన్మరణానికి పాల్పడడంతో కాలేజీతో పాటు స్థానికంగా కలకలం రేగింది. అయితే అతను బలవన్మరణానికి ముందు ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో "Today My Last Day" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే తమ బిడ్డ మనస్తాపానికి గురై హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ ఘటనలో కాలేజీ యాజమాన్యం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా, నేరుగా మృతదేహాన్ని మార్చురీకి తరలించడంపై కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యం బాధ్యతారాహిత్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీ ముందు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారంతా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతితో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story