గాంధీజీని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లే : షర్మిల

by Thanuru Gopichand |

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతో పరోక్ష విమర్శలు చేసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు.

గాంధీజీని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లే : షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రి రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) చేపట్టిన గాంధీ సందేశ యాత్ర (Gandhi Sandesha Yatra) నిన్నటితో ముగిసింది. జనవరి 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. నీలకంఠాపురం నుంచి హిందూపురం (Neelakantapuram To Hindupuram) వరకూ సాగిన ఈ యాత్రలో గాంధీ సిద్ధాంతాలను యువకులకు, విద్యార్థులకు తెలియజేశారు. పిల్లలు, యువతతో రాజ్యాంగ విలువలను కాపాడుతూ, సత్యం, అహింస, నైతిక ధైర్యం వంటి గాంధేయ సిద్ధాంతాల ఆధారంగా అన్యాయానికి ఎదిరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. యాత్ర విజయవంతంగా కావడంతో పాటు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించింది.

రఘువీరా రెడ్డి నిర్వహించిన గాంధీ సందేశ యాత్రపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. బిజెపి (BJP) ప్రభుత్వం బాపూజీకి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు. అందుకు నిరసనగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరా రెడ్డి చేపట్టిన యాత్ర అభినందనీయం అన్నారు. మహాత్మా గాంధీ చూపిన బాటలో యాత్ర చేయడం అందరికీ స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయం అని పేర్కొ్న్నారు. గాంధీజీని అవమానిస్తే దేశం మొత్తాన్ని అవమానించినట్లేనని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాట చరిత్రను కించపరిచినట్లేనని కుండబద్ధలు కొట్టారు. మహాత్మా గాంధీని అవమానించేలా చేపట్టిన ప్రచారాలను దేశ ద్రోహ చర్యతో సమానంగా పోల్చారు. ఇలాంటి విద్రోహ చర్యలను, మహాత్మా గాంధీ పేరు తొలగించాలనే కుట్రలను ప్రతి భారతీయుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

Next Story