- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరు నెలల్లో మౌలిక వసతులు పూర్తి: మంత్రి నారాయణ
రాజధాని గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వ హామీ.

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati) రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Narayana) స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఆయన తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి శ్రవణ్ కుమార్‌తో కలిసి గ్రామ సభలలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదటి రోజు నేలపాడు, మల్కాపురం గ్రామాల్లోని నివాసితులు, రైతులు, అధికారులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టిన ట్రంక్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్లాట్ల అభివృద్ధి, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాల పురోగతిని ఆయన వివరించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
రాబోయే ఆరు నెలల్లోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. గతంలో నిలిచిపోయిన లేఅవుట్ ఫార్మేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని పేర్కొన్నారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో అన్ని సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని తెలిపారు. ప్రధానంగా రహదారుల అనుసంధానం, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంత అభివృద్ధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వారి భాగస్వామ్యంతోనే నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
అనంతరం రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ భవన నిర్మాణాలను పరిశీలించారు. 4,026 గృహ సముదాయాల నిర్మాణం జరుగుతోందన్నారు. 500 గ్రౌండ్ ఫ్లోర్ నివాసాలు మినహా మిగతావన్నీ మార్చి 31 నాటికి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. మంత్రులు, జడ్జిల నివాసాల్లో బ్రిక్స్ వర్క్ పూర్తయ్యిందన్నారు. జనవరి 7 నుంచి రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభించనున్నాం అన్నారు. ల్యాండ్ పూలింగ్ కు మెజారిటీ ప్రజలు అంగీకరించారని తెలిపారు. కొందరు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు.






