చిత్తూరులో పారిశ్రామిక పరుగులు..1.16 లక్షల మందికి ఉపాధి లక్ష్యం!

by velandi.Saikiran |   (  Updated:2026-03-20 23:15:31  IST  )

చిత్తూరు జిల్లా పారిశ్రామిక రంగంలో నవ శకానికి నాంది పలుకుతోంది.

చిత్తూరులో పారిశ్రామిక పరుగులు..1.16 లక్షల మందికి ఉపాధి లక్ష్యం!
X

చిత్తూరులో పారిశ్రామిక పరుగులు!

*పెట్టుబడుల ప్రవాహం.. ఉపాధి కేతనం

*ఎన్డీయే పాలనలో మారుతున్న జిల్లా ముఖచిత్రం

*ఎంఎస్ఎంఈ 4.0 పాలసీతో

గ్రామీణ పారిశ్రామికీకరణకు ఊతం

*కుప్పం, గంగాధరనెల్లూరు హబ్‌లుగా అవతరణ

*1.16 లక్షల మందికి ఉపాధి లక్ష్యం

దిశ, చిత్తూరు ప్రతినిధి: చిత్తూరు జిల్లా పారిశ్రామిక రంగంలో నవ శకానికి నాంది పలుకుతోంది. గతంలో కేవలం వ్యవసాయం, పాడి పరిశ్రమపైనే ఆధారపడిన ఈ ప్రాంతం, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలకు చిరునామాగా మారుతోంది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ వేగవంతం చేసిన చర్యలు, పారదర్శక భూసేకరణ విధానాలు జిల్లాకు పెట్టుబడుల పంట పండిస్తున్నాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక కళ సంతరించుకుంటోంది.

ఎంఎస్ఎంఈ 4.0... ఒక గేమ్ ఛేంజర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల విధానం 4.0' జిల్లాలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 2030 నాటికి "ప్రతి కుటుంబానికి ఒక వ్యాపారి" అనే లక్ష్యం కేవలం నినాదంగా కాకుండా, క్షేత్రస్థాయిలో అమలు కావడానికి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఈ నూతన విధానం ద్వారా పారిశ్రామికవేత్తలకు రాయితీలు అందించడమే కాకుండా, స్థానిక వనరులను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇది జిల్లాలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

పారిశ్రామిక పార్కుల విస్తరణ.. పక్కా ప్రణాళిక

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు ప్రధాన ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి చేసి, ప్లాట్ల అభివృద్ధిని అధికారులు వేగవంతం చేశారు. వెంకటాపురం ప్రాంతంలో 40.28 ఎకరాల్లో 43 ప్లాట్లు... పొగురుపల్లిలో 15.82 ఎకరాల్లో 112 ప్లాట్లు.. మంగాడులో 12.90 ఎకరాల్లో 87 ప్లాట్లు.. చదళ్లలో 10.44 ఎకరాల్లో 74 ప్లాట్లు... నంగమంగళంలో 5.51 ఎకరాల్లో 25 ప్లాట్లను సిద్ధం చేశారు. మొత్తంగా 84 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 340కి పైగా పారిశ్రామిక ప్లాట్లు అందుబాటులోకి రావడం విశేషం. వీటి ద్వారా సుమారు 6,055 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. గంగాధరనెల్లూరు, పి. కొత్తకోట ప్రాంతాల్లో కూడా భూసేకరణ ప్రక్రియ తుది దశలో ఉంది.

కుప్పం... పారిశ్రామిక ‘పవర్ హౌస్’

కుప్పం నియోజకవర్గం ఇప్పుడు పారిశ్రామికంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇక్కడ మొత్తం 27 భారీ పరిశ్రమల ద్వారా రూ. 14,308.57 కోట్ల భారీ పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా ఏకంగా 1,16,639 మందికి ఉపాధి లభించనుండటం గమనార్హం. ఇప్పటికే 8 పరిశ్రమలు పనులు ప్రారంభించగా, మరో 12 పరిశ్రమలు ప్రారంభ దశలో ఉన్నాయి. హిందాల్కో, మదర్ డెయిరీ, ఈ-రాయిస్ మోటార్స్, కింగ్స్ వుడ్ వంటి దిగ్గజ సంస్థలు కుప్పంను తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయి.

గంగాధరనెల్లూరులో ‘మెగా’ ప్రతిపాదనలు

గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో భారీ పరిశ్రమల స్థాపనకు డిమాండ్ పెరుగుతోంది. ఎస్.ఆర్.పురం మండలంలోని పాతపాళ్యెం వద్ద 600 ఎకరాల్లో పోలీహోస్ ఇండియా, మరో 300 ఎకరాల్లో ఎన్డీఆర్ మౌలిక వసతుల సంస్థ తమ ప్రాజెక్టులను చేపట్టనున్నాయి. ఈ మెగా పరిశ్రమలు అందుబాటులోకి వస్తే వేల సంఖ్యలో అనుబంధ పరిశ్రమలు ఏర్పడి, జిల్లా ఆదాయం పెరగడమే కాకుండా వలసలను నిరోధించే అవకాశం ఉంది.

మారనున్న చిత్తూరు జీవనచిత్రం

చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి స్థాయిని గమనిస్తే, రాబోయే ఐదేళ్లలో ఈ జిల్లా దక్షిణ భారతదేశంలోనే ఒక కీలక పారిశ్రామిక కేంద్రంగా అవతరించడం ఖాయం. పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.

Next Story