vantara jamnagar: అనగనగా.. ఓ వన్‌తార India's Star Of The Forest

by Thanuru Gopichand |   (  Updated:2025-03-09 15:54:12  IST  )

అనగనగా ఓ అడవి.. చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవి..

vantara jamnagar: అనగనగా.. ఓ వన్‌తార  Indias Star Of The Forest
X

ఆరు వందల ఎకరాల్లో కృత్రిమ వనం

వన్యప్రాణులకు చికిత్స.. పునరావాసం

దేశంలోనే భారీ జంతు సంరక్షణ కేంద్రం

2 వేల ఏనుగులు, 300 చిరుత పులులు

సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ

మరి సామాన్యులకు ప్రవేశం ఎప్పుడో..?

అనగనగా ఓ అడవి (Forest).. చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవి.. అందులో ఆకాశం అంత ఎత్తులో ఏపుగా పెరిగిన మొక్కలు.. జలచరాలు ఉండే తటాకాలు. స్వచ్ఛమైన గాలి.. చందమామ కథ గుర్తొస్తుంది కదా.. అటువంటి అడవిననే కృత్రిమంగా సృష్టించారు.. అది కూడా మనదేశంలోనే.. గుజరాత్‌లోని రిలయన్స్ జామ్‌నగర్ (vantara jamnagar) రిఫైనరీ కాంప్లెక్స్‌లో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్ట్ వన్ తార. 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న కృత్రిమ అడవి ఇది. స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ (Star of the forest)అని పిలుచుకునే ఈ ప్రాంతాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల రెండో తేదీన సందర్శించారు. ఆ జంతు సామ్రాజ్యంలోకి అడుగుపెట్టారు. చిరుత, పులులు, సింహాలు, ఏనుగులు అక్కడ ఉంటాయి.. జల జీవులు మొసళ్లు, తాబేళ్లు, నీటి ఏనుగులు.. ఇలా ఎన్నో ఉంటాయి.. కానీ అది అడవి కాదు.. అలాగని మనకు తెలిసిన జూ కూడా కాదు.. అది ఒక కృత్రిమ అడవి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. అంతరించిపోయే ముప్పు ఉన్న జీవజాతులు, అరుదైన జంతువులు, వేటగాళ్ల బందీల్లో హింసకు గురైన ప్రాణులకు పునరుజ్జీవం కల్పించి వాటిని తిరిగి అడవిలోకి వదిలేయడమే వన్ తార ముఖ్య ఉద్దేశం. - అనిల్ శిఖా


వన్‌తారను ప్రధానంగా జంతువుల సంరక్షణ పునరావాసం కోసం ఏర్పాటు చేశారు. అనంత్ అంబానీ (Ananth Abani) నేతృత్వంలో ఇది ఏర్పాటైంది. దీనిని గత ఏడాది 2024 ఫిబ్రవరి 26న ప్రారంభించారు. ఏనుగులు, చిరుతలు, సింహాలు, పులులు మరియు సరీసృపాలు వంటి 43 జాతులకు చెందిన 2వేల కంటే ఎక్కువ జంతువులను రక్షించి వన్ తారాలో ఉంచారు. స్తుతం ఇక్కడ 2వేలకు పైగా ఏనుగులు, 3వందలకు పైగా చిరుతపులులు, పులులు, సింహాలు, జాగ్వార్లు ఉన్నాయి. అలాగే.. 300కి పైగా జింకల లాంటి శాకాహార జీవులు, 12వందలకు పైగా మొసళ్లు, పాములు, తాబేళ్లున్నాయి. ఏనుగుల కోసం 600 ఎకరాల్లో సహజ వాతావరణాన్ని సృష్టించారు. ఇందులో ఎలిఫెంట్స్ (Elefents) ఆర్థరైటిస్ చికిత్సకు భారీ జాకీ, హైపర్ బారిక్ ఆక్సిజన్ చాంబర్లు, లేజర్ యంత్రాలతో కూడిన ప్రత్యేక ఎలిఫెంట్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎమ్మారై, ఎక్స్ రే, ఐసీయూ, సీటీ స్కాన్, శస్త్రచికిత్సల కోసం వీడియో కాన్ఫరెన్స్ వంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఆస్పత్రి, పశు వైద్య పరిశోధన కేంద్రం మొత్తం లక్ష చదరపు అడుగుల్లో ఉంటుంది. హైడ్రోథెరపీ కోసం ఇక్కడ ప్రత్యేక కొలనులు ఏర్పాటు చేశారు.


కీలక జాతుల జీవులకు పునరావాసం

జంతు సంరక్షణ, సంక్షేమం కోసం ప్రముఖ నిపుణులతో కలిసి పనిచేస్తోంది వన్ తార. రక్షించిన ప్రాణి జాతులు వృద్ధి చెందడానికి సహజమైన, పచ్చని ఆవాసాలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనియన్ వంటి.. ప్రకృతి పరిరక్షణ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నది. కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగంగా వందలాది జంతువులను కాపాడారు. వేలాది ఇతర జంతువులు, పాములు, పక్షులు, ఖడ్గమృగం, చిరుతపులి, మొసలి వంటి కీలక జాతుల జీవులకు పునరావాసం కల్పిస్తోంది వన్ తార.

హైటెక్ హాస్పిటల్.. రీసెర్చ్ సెంటర్

ఇక్కడ అధునాతనమైన హాస్పిటల్, పరిశోధనా కేంద్రం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీతో ఐసీయూ, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్రే, ఆల్ట్రా సౌండు, ఎండోస్కోపీ, డయాలసిస్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రక్తంలోని ప్లాస్మాను వేరు చేసే సాంకేతిక వ్యవస్థ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతులను కాపాడుతున్నారు. మన దేశంలో అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ సేవలను అందించేందుకు దాదాపు నాలుగు వేల మంది సిబ్బంది ఉన్నారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జూలో సౌరశక్తిని ఉపయోగించడం మరో విశేషం.

అతరించిపోతున్న జాతులను రక్షించేలా..

భారతదేశంతో పాటు వివిధ దేవాల్లో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడంపైనే వన్ తార పని చేస్తుంది. మెక్సికో, వెనిజులా మొదలైన దేశాలలో జరిగే అటవీ జంతువుల రెస్క్యూ మిషన్లలో కూడా వంతారా పాల్గొననుంది. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర, వైద్య నిపుణులు కొందరు వన్‌తార మిషన్‌లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా సహకరిస్తున్నాయి.

తెల్లపులికి అలర్జీ చికిత్స

ఓ తెల్లపులి సర్కస్లో హింసకు గురైంది. దానికి చర్మవ్యాధి సోకింది. వంతారా వైద్యులు పరీక్ష చేయగా దానికి చర్మపు అలర్జీ ఉందని తెలుసుకున్నారు. దీంతో అది శరీరాన్ని బాగా గీక్కునేది. దాని చర్మం ఎర్రగా మారి చాలా చోట్ల పుండ్లు పడ్డాయి. వాటి వల్ల కలిగే నొప్పితో బాధపడుతూ ఉండేది. వెంటనే ప్రత్యేక ఇక్కడకు తీసుకువచ్చి దానికి చికిత్స అందించారు. మందులు వాడారు. అది బలంగా తయారవడానికి మంచి ఆహారాన్ని కూడా ఇచ్చారు. క్రిమికీటకాలు దాని దగ్గరకు రాకుండా శుభ్రమైన స్థలంలో ఉంచి ఆ ప్రదేశానికి ఎయిర్ ఫిల్టర్లను కూడా ఉపయోగించారు. చివరకు ఆ డైనా చర్మరోగం తగ్గిపోయింది. ఇప్పుడు అది వన్ తారలోనే ఉంది.

మొసలికి దవడ సమస్య

దవడ సమస్యతో బాధపడుతున్న ఓ మొసలికి ఇక్కడ మెరుగైన చికిత్స అందించారు. ఇప్పుడు ఆ మొసలి కడుపునిండా ఆహారం తినగలుగుతోందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కొందరు ఏనుగులతో బరువైన కలపను మోయించేవారు. అక్కడ ఉన్న 20 ఏనుగులను వన్ తార రక్షించింది. ఆ ఏనుగులకు గొలుసులు తీసివేసింది. వాటిలో పది మగ ఏనుగులు, ఎనిమిది ఆగ ఏనుగులు, రెండు చిన్నపిల్లలు ఉన్నాయి. వీటిని వంతారాకు తరలించారు. ఇప్పుడు అవి అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.

అంతరిస్తున్న చిలుక జాతి రక్షణ

బ్రెజిల్‌లో స్పిక్స్ మకావ్స్ (ఒక రకమైన చిలుక జాతి)ని సంరక్షించేందుకు అసోసియేషన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ థ్రెటెన్డ్ ప్యారెట్స్ వన్ తార గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ రెండూ కలిసి సిద్ధం అయ్యాయి. ఈ వేగంగా అంతరించుపోతున్న జాతి. 41 స్పిక్స్ మకావ్స్‌ ప్రస్తుతం బ్రెజిల్లో రెస్క్యూ సెంటర్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో వన్ తార భాగస్వామిగా ఉండడం విశేషం.

సామాన్యులకు ప్రవేశం ఉందా?

ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జంతు సంరక్షణశాలను సందర్శించారు. గోల్డెన్ టైగర్స్, స్నో టైగర్ను ఆయన చూశారు. రక్షించబడిన చింపాంజీలు, ఒరంగుటాన్ వంటి జీవులతో కూడా గడిపారు. నీటిలో మునిగిపోయిన హిప్పోపొటామస్, మొసళ్లను గమనించారు. జీబ్రాస్ మధ్య నడిచారు. ఖడ్గమృగం దూడకు ఆహారం అందంచారు. ఇదే సమయంలో సామాన్యం జనం కూడా దీనిని సందర్శించ వచ్చా.. అనే ఆసక్తి కలిగింది. గత ఏడాది దీనిని ప్రారంభించారు. ముఖ్యంగా ఇది జంతు సంరక్షణ కేంద్రం.. అంతరించిపోతున్న జంతువులను సంరక్షించి, వాటికి వైద్యసాయం అందించి తిరిగి వాటిని అడవిలోకి వదిలేస్తారు. అయితే సామాన్యులకు వంతారా ప్రవేశంపై ఇంతవరకు నిర్వాహకులు ఎటువంటి ప్రకటన చేయలేదు

Next Story