వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్

by Naga Rani Yarlagadda |

కోస్తా జిల్లాల వైపు మొంథా తుపాను దూసుకొస్తోంది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడగా..

వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి.. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కోస్తా జిల్లాల వైపు మొంథా తుపాను దూసుకొస్తోంది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడగా.. వాతావరణశాఖ అధికారులు దానికి మొంథాగా (Montha Cyclone) నామకరణం చేశారు. గడిచిన 3 గంటల్లో తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ తుపాను చెన్నైకి 600 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 710 కిలోమీటర్లు, కాకినాడకి 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

తుపాను హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వాతావరణం ప్రశాంతంగానే ఉందని ప్రజలు అశ్రద్ధగా ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలంతా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని, నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మొంథా తుపాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏపీ జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ చేసింది. సోమవారం 7 జిల్లాలకు రెడ్, 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్టులు జారీ చేసింది. అలాగే మంగళవారం (అక్టోబర్ 28) 14 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. భారీ వర్షసూచనల నేపథ్యంలో ఎమర్జెన్సీ హెల్ప్ కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఆయా జిల్లాల్లో రెడీగా ఉన్నట్లు APSDMA తెలిపింది.

Next Story