వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే బలీయమైన ఆర్థిక శక్తిగా భారత్ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

by Disha Web Desk 21 |
వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే బలీయమైన ఆర్థిక శక్తిగా భారత్ : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ,డైనమిక్ బ్యూరో : ప్రపంచంలో భారతదేశం బలీయమైన ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందుతోందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. అత్యధిక జీడీపీ కలిగిన దేశాలలో 10వ స్థానంలో ఉన్న భారత్‌ పదేళ్ళ వ్యవధిలో 5వ స్థానానికి చేరిందని చెప్పుకొచ్చారు. వచ్చే అయిదేళ్ళలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు యావత్తు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ముందుకు పోతోందని ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది మన జీడీపీ భారీగా పెరిగి 7.2 శాతంగా నమోదైంది. ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్‌లో దేశ జీడీపీ 7.6 శాతం వృద్ధితో మార్కెట్ అంచనాలను మించిపోయిందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పన్నుల వసూళ్ళలో నానాటికి సాధిస్తున్న గణనీయమైన వృద్ధి భారత్ ఆర్థిక పురోగతికి ఇంధనంలా మారిందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పదేళ్ళలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 160 శాతం పెరిగాయన్నారు. 2013-14 మధ్య రూ.6.4లక్షల కోట్లు ఉన్న ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు 2022-23 నాటికి రూ.16.6 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పన్నుల వసూళ్ళు 18 శాతం పెరిగాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ళు 13.3 లక్షల కోట్లు అంటే సగటున 1.66 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్ళు జరుగుతున్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 12 శాతం పెరిగింది. పన్నులు పెద్దగా పెంచకుండానే ఇంత భారీగా పన్నులు వసూళ్ళు జరగడం వెనుక ప్రభుత్వ సామర్ధ్యం, పనితీరు స్పష్టం అవుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed