- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Quantum Valle: అమరావతిలో.. క్వాంటమ్ వ్యాలీ
అమరావతి కేంద్రంగా వచ్చే ఏడాది ఒకటో తేదీన క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభం
ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్‌టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
‘క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్’ కలిగిన ‘క్వాంటం సిస్టం 2’ ఏర్పాటు
దేశంలో క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
దిశ, ఏపీబ్యూరో : అమరావతి కేంద్రంగా (Amaravathi) వచ్చే ఏడాది ఒకటో తేదీన క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సన్ అండ్ టూబ్రో సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఒప్పందం ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మకం అని అన్నారు. ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందని చెప్పారు. సాంకేతికరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని, అయితే వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమని సీఎం అన్నారు. భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌పైనే ఆధారపడి ఉంటాయని అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీ చేయాలనుకున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, (IBM) టీసీఎస్ (TCS) సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు.
హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, క్వాంటమ్ వ్యాలీ తక్కువ సమయంలోనే నిర్మించవచ్చన్నారు. ఇప్పటికే ఎల్ అండ్‌టీకి (L$T) స్థలాన్ని కేటాయించామని, మౌలిక వసతులను అత్యంత వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా మాట్లాడుతూ భారతదేశంలో ఐబీఎం క్వాంటం సిస్టం 2 స్థాపన, దేశ క్వాంటం ప్రయాణానికి కీలక మలుపు కానుందదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - టీసీఎస్‌తో కలిసి పని చేయడం వల్ల క్వాంటం అల్గోరిథం అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో టీసీఎస్ తొలిసారి రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు బీజం వేసిందని టీసీఎస్ ప్రతినిధులు వి. రాజన్న, సి.వి. శ్రీధర్ గుర్తు చేశారు. క్వాంటం కంప్యూటింగ్ అనేది రెండో క్వాంటం విప్లవమని, ఈవీ బ్యాటరీల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు దీని ఉపయోగాలు విస్తృతంగా ఉంటాయని ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ అన్నారు.






