Alert: కోస్తాకు అత్యంత ఎండల ముప్పు.. హెచ్చరించిన ఐఎండీ

by Naga Rani Yarlagadda |

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ కీలక హెచ్చరిక చేసింది. కొన్ని జిల్లాల్లో సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు తెలిపింది.

Alert: కోస్తాకు అత్యంత ఎండల ముప్పు.. హెచ్చరించిన ఐఎండీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను సూర్యుడు తన ప్రతాపంతో బెంబేలెత్తిస్తున్నాడు. ఓ వైపు తీవ్రమైన ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంటే.. మరోవైపు వడగాలులు వీస్తున్నాయి. దీంతో చిన్న పిల్లల నుంచి అన్ని వయసుల వారు నానా నరకయాతన అనుభవిస్తున్నారు. 10 నిమిషాలైనా బయటికెళ్లాలంటేనే జంకుతున్నారు. తప్పనిసరిగా ఉద్యోగాలు, పనులకు వెళ్లేవారు మినహా.. మిగతావారు ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రివేళల్లోనూ వేడి తగ్గకపోవడంతో చెమటలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు పిడుగులాంటి వార్త చెప్పింది.

కోస్తాంధ్రలో ఈ నెల 26వ తేదీ వరకూ ప్రచండ ఎండలు ఉంటాయని హెచ్చరించింది. మరో ఐదురోజులపాటు అతి తీవ్రమైన వడగాలులు, దక్షిణ కోస్తాలో అత్యధిక వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో దక్షిణ కోస్తాలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ సీజన్లో బాపట్లలో సాధారణంకంటే 7.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.

మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ వరకూ రాష్ట్రంలో తీవ్ర వడగాలులు వీస్తాయని, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో హీట్ వేవ్ మరింత పెరుగుతుందని హెచ్చరించింది. ఈ రెండు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సున్నట్లు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు పడతాయని, రెండు మూడ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పింది. ప్రస్తుతం యూపీ-ఛత్తీస్ గఢ్- ఒడిశా మీదుగా ద్రోణి కొనసాగుతోందని, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

Next Story