Chandrababu: నాది.. ఉడుంపట్టు.. ఒక పని తలపెడితే మధ్యలో వదిలిపెట్టను..

by Thanuru Gopichand |

నాది ఉడుం పట్టు.. ఒకసారి తలపెడితే మధ్యలో వదిలిపెట్టను. దీనివల్ల గతంలో మంచి ఫలితాలు వచ్చాయి’ అని ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: నాది.. ఉడుంపట్టు.. ఒక పని తలపెడితే మధ్యలో వదిలిపెట్టను..
X

- గతంలో దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి

- పేదల సంక్షేమం కోసం పీ4 అమలుచేస్తున్నా

- ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

- 11 ఎంఎస్ఎంఈ పార్కులు వర్చువల్‌గా ప్రారంభం

దిశ, డైనమిక్ బ్యూరో: ‘నాది ఉడుం పట్టు.. ఒకసారి తలపెడితే మధ్యలో వదిలిపెట్టను. దీనివల్ల గతంలో మంచి ఫలితాలు వచ్చాయి’ అని ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ఇవాళ ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంపద సృష్టిస్తాం.. అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. అభివృద్ధి సంపద సృష్టిస్తుంది.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ఎన్నికల ముందు తాము హామీ ఇచ్చినట్లుగా 20 లక్షల మందికి ఉపాధి హామీ కల్పనకు కట్టుబడి ఉన్నామన్నారు. పేదల సంక్షేమం కోసం పీ4 (P4) అమలుచేస్తున్నట్లు వివరించారు.

భవిష్యత్ ఏఐదే..

భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దేనని (Artificial Intelligence) చంద్రబాబు చెప్పారు. ఏఐని ఉపయోగించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని సూచించారు. రైతులు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రైతుల పరిశ్రమలకు అవసరమైన అనుమతులు ఇస్తామని తెలిపారు. 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ (MSME)పార్క్, 100 ఎకరాలకు పైగా ఉంటే మేజర్ పార్కులు ఏర్పాటు చేయవచ్చన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 5,000 కోట్లతో ఎల్జీ సంస్థ 10వేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దీపం-2 పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

90శాతం పింఛన్ల పంపిణీ

ఏపీలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు 90.86 శాతం సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీలో మొదటి స్థానంలో విజయనగరం జిల్లా నిలిచింది. చివరి స్థానంలో 87 శాతంతో పల్నాడు జిల్లా ఉంది. ఇవాళ ఉదయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం గ్రామం ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్‌ను అందించారు. టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. సుస్మిత ఐదేళ్ల కుమార్తె చైత్రికను గురుకుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పిస్తామని హామీ ఇచ్చారు. మరో మహిళ అంకోజి సుమ తన కుమారుడికి ఉపాధి మార్గం చూపించాలని విన్నవించగా వ్యవసాయ శాఖ నుంచి డ్రోన్ అందించి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం కాలనీ వాసుల నుంచి పలు అర్జీలను సీఎం స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీలోని పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పింఛన్లు అందజేశారు.

Next Story