సీటు నెంబర్ 29 నుంచి 11కు బ్యాగ్ ఎలా చేరింది?

by Thanuru Gopichand |

ఏవీఎస్ఓ సతీష్ కుమార్ (AVSO Satish Kumar) హత్య కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది.

సీటు నెంబర్ 29 నుంచి 11కు బ్యాగ్ ఎలా చేరింది?
X

దిశ, వెబ్ డెస్క్ : ఏవీఎస్ఓ సతీష్ కుమార్ (AVSO Satish Kumar) హత్య కేసు దర్యాప్తు వేగవంతం అయ్యింది. వారం రోజుల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాలని దర్యాప్తు పోలీసు బృందాలకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో వివిధ కోణాల్లో దర్యాప్తు బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా సతీష్ కుమార్ సీటు నెంబర్ 29 కాగా అతని బ్యాగ్ 11 నెంబరు సీటు వద్దకు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ మేరకు రైలు బోగీలోని సిబ్బందిని కూడా పోలీసులు విచారించారు.

సతీష్ కుమార్​ను రైలులోనే హత్యచేసి కిందకు తోశారా, లేక నడుస్తున్న రైలు నుంచి కిందకు తోసి హత్యచేశారా అన్న విషయాలను పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గుత్తి జీఆర్పీ పోలీసులు సతీష్ కుమార్​ది హత్యగా నిర్దారించారు. అంతేకాకుండా పరకామణి కేసులో నిందితులుగా ఉన్నవారిని హత్యకేసులో నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సతీష్ కుమార్ సెల్ ఫోన్‌ను అమరావతిలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించి డేటాను సేకరిస్తున్నారు. మరోవైపు సతీష్ కుమార్ మృతి చెందిన రోజు నుంచి వారం రోజుల ముందు కాల్ డేటా కోసం సెల్ ఫోన్ నెట్ వర్క్ సంస్థకు అభ్యర్థన పంపించారు.

డీజీ రవిశంకర్ దిశా నిర్దేశం

సీఐడీ విభాగం డీజీ రవిశంకర్ అయ్యనార్ (DG Ravi Shankar Ayyanar) అనంతపురం చేరుకొని ప్రత్యేక పోలీసు బృందాలకు దిశానిర్దేశం చేశారు. పోలీసులు, వివిధ విభాగాల వైద్య నిపుణులతో వేర్వేరుగా సమావేశమైన డీజీ అనేక అంశాలపై వివరాలను తెలుసుకున్నారు. తాడిపత్రిలో మృతదేహం లభ్యమైన చోట ఘటన జరిగిన తీరును సీన్ రీకన్ స్ట్రక్షన్ (Cine Reconstruction) ద్వారా తెలుసుకున్నారు. నడుస్తున్న రైలులో నుంచి పోలీసులు బొమ్మలను కిందకు తోసేసి, ఏ భాగానికి గాయలవుతాయన్న విషయాలను పరిశీలించారు. గుత్తి నుంచి రెండు రైళ్లలో ప్రయాణించి పోలీసులు మూడు బొమ్మలను నడుస్తున్న రైలు నుంచి వేగంగా కిందకు తోసి, సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. అంతేకాకుండా అక్కడి ఆర్ అండ్‌ బీ అతిథిగృహంలో పోలీసు అధికారులు, వివిధ స్పెషాలిటీల వైద్యులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. సతీష్ మృతదేహానికి సీటీ స్కానింగ్ నిర్వహించిన రేడియాలజిస్టులు, శవ పరీక్ష చేసిన ఫోరెన్సిక్ వైద్యులతో రవిశంకర్ అయ్యనార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారు చెప్పిన విషయాలపై చర్చించడానికి ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరాలజీ వైద్య నిపుణులను పిలిపించి శవ పరీక్షలో గుర్తించిన అంశాలను చర్చించి శాస్త్రీయ అంశాలను తెలుసుకున్నారు.

Next Story