- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరులో హాట్ టాపిక్...థియోసాఫికల్ భూములపై 'పెద్దల' కన్ను!
చిత్తూరు నగర నడిబొడ్డున, బస్టాండ్ సమీపంలో ఉన్న రూ.వందల కోట్ల విలువైన థియోసాఫికల్ సొసైటీ భూములపై రియల్ మాఫియా కన్ను పడింది.

థియోసాఫికల్ భూములపై 'పెద్దల' కన్ను!
- అర్ధరాత్రి చారిత్రక కట్టడం కూల్చివేత
- దాతల ఆశయానికి తూట్లు
- చిత్తూరులో హాట్ టాపిక్‌గా వ్యవహారం
దిశ, చిత్తూరు ప్రతినిధి: చిత్తూరు నగర నడిబొడ్డున, బస్టాండ్ సమీపంలో ఉన్న రూ.వందల కోట్ల విలువైన థియోసాఫికల్ సొసైటీ భూములపై రియల్ మాఫియా కన్ను పడింది. శతాబ్ద కాలపు చరిత్ర ఉన్న ఈ ఆస్తులను అక్రమంగా చేజిక్కించుకోవాలని చూస్తున్న వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ.. మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) డి.కె. రఘురాం రంగంలోకి దిగారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరుతూ చిత్తూరు రిజిస్ట్రార్‌కు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.
అర్ధరాత్రి కూల్చివేత
సుమారు వందేళ్ల క్రితం సామాజిక సంస్కర్త అనిబిసెంట్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సొసైటీకి 1913లో నరసింహులు నాయుడు, అరుణాచల మొదలియార్ వంటి దాతలు 3.05 ఎకరాల భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా అందించారు. పేద విద్యార్థుల చదువుల కోసం మాత్రమే ఈ ఆస్తులను వాడాలని దాతలు స్పష్టమైన నిబంధనలు పెట్టారు. అయితే, గత 15 ఏళ్లుగా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు వ్యక్తులు ఈ విలువైన భూమిపై కన్నేశారు. వారం క్రితం అత్యంత పురాతనమైన సొసైటీ భవనాన్ని అర్ధరాత్రి పూట గుట్టుచప్పుడు కాకుండా కూల్చివేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
సొసైటీ మాదే.. కానీ ఆధారాలు లేవు!
తాజాగా, జాతీయ థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షుడినని చెప్పుకుంటున్న ప్రదీప్ గోయల్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి, ఈ ఆస్తులను అమ్మే హక్కు తమకు ఉందని ప్రకటించడం గమనార్హం. అయితే, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపాలని విలేకరులు ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పలేక ఆగ్రహం వ్యక్తం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ భూములను కొందరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
న్యాయపోరాటానికి సిద్ధం: మాజీ పీపీ రఘురాం
ఈ నేపథ్యంలోనే న్యాయవాది రఘురాం రిజిస్ట్రార్‌కు నోటీసులు పంపుతూ కీలక హెచ్చరికలు చేశారు. ఈ భూములు కేవలం విద్యా దానానికి ఉద్దేశించినవి, వీటిని విక్రయించే అధికారం సొసైటీ సభ్యులకు లేదని... ఒకవేళ నిబంధనలు అతిక్రమించి రిజిస్ట్రేషన్ చేస్తే, అటు రిజిస్ట్రార్‌తో పాటు ఇటు విక్రయదారులపై సివిల్, క్రిమినల్ కేసులు పెట్టడం ఖాయమన్నారు. 1942లో సి.పి. పార్థసారథి అయ్యంగార్ వంటి ప్రముఖులు ఇచ్చిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వందల కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూములను (ట్రస్ట్ భూములను) కాపాడతారా లేక అక్రమార్కులకు కొమ్ముకాస్తారా అన్నది ఇప్పుడు చిత్తూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించకుంటే న్యాయపోరాటం మరింత ఉధృతం చేస్తామని రఘురాం స్పష్టం చేశారు.






