- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rains: ఏపీలో దంచికొడుతున్న వానలు.. పొంగుతున్న వాగులు, వంకలు
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడ నుంది. 48 గంటల్లో ఉత్తర తీరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం జూలకల్లులో భారీగా వరద వచ్చి చేరింది. కొత్త బ్రిడ్జి నిర్మాణం వద్ద రోడ్డుపై నీటి ప్రవాహంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది.
పిడుగురాళ్ల-కారంపూడి వెళ్లే రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జేసీబీతో రాకపోకలకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి కాజా టోల్ ప్లాజా జలదిగ్భందంలో చిక్కుకుంది. గుంటూరు-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర భారీగా వరద నీరు చేరింది. మాచవరంమండలం పిల్లుట్లలో పీలేరు వాగు ఉధృతిగా ప్రవహిస్తోంది. మాచవరం- బెల్లంకొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో కొండవీడు వాగు పొంగుతోంది. తాడికొండ– అమరావతి మధ్య రాకపోకలు బంద్అయ్యాయి. అమరావతి విజయవాడ మార్గంలో పెద్దమ్మదూరు వాగు ఉద్ధృతి పెరిగింది.
గుంటూరు మార్గంలో నరుకుల్లపాడు, లాం వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో వర్షానికి వేల ఎకరాలు నీటమునిగాయి. దుగ్గిరాల మండలం మంచికలపూడి, కంఠంరాజు కొండూరు వద్ద వాగులో లారీ చిక్కుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మహానంది, దొర్నిపాడు, కోవెలకుంట్ల, ఆదోని, ఆస్పరి, కౌతాళం మండలాల్లో, కర్నూలు నగరం సహా నంద్యాల పట్టణంలో వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం నందమూరులో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. నందమూరు వద్ద ఆటోపై తాటి చెట్టు విరిగిపడడంతో పలువురికి గాయాలలయ్యాయి. నేడు, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురవున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ రోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.






