నైరుతి రాక ఆలస్యం.. వారంరోజులు ఠారెత్తించనున్న ఎండలు

by Naga Rani Yarlagadda |

ఏపీలో రేపటి నుంచి ఎండలు, వడగాల్పులు తీవ్రస్థాయిలో ఉంటాయని APSDMAహెచ్చరించింది.

నైరుతి రాక ఆలస్యం.. వారంరోజులు ఠారెత్తించనున్న ఎండలు
X

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మరో వారంరోజులపాటు ఠారెత్తించనున్నాయి. ఏపీలో మరో వారంరోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిందని, శనివారం వరకూ ఎండల తీవ్రగా ఇలాగే కొనసాగుతుందని తెలిపింది. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అలాగే విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42-44 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. అలాగే 26 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో.. మంగళవారం... పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్సుందని APSDMA తెలిపింది.

ఈ ఏడాది మాన్సూన్ సీజ్ పై ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఈ ఎల్ నినో ప్రభావం కనిపిస్తుందని తెలిపింది. కాగా.. ముందుగా అంచనా వేసినదానికంటే.. నైరుతి రాక కాస్త ఆలస్యమవుతుందని తెలిపింది. మే 26న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది. ఇవి రాయలసీమ మీదుగా తెలంగాణలోకి జూన్ 5 -10 తేదీల్లో ప్రవేశించే ఛాన్స్ ఉందని, నైరుతి వచ్చినా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

Next Story