GMR గ్రూప్‌కు హృదయపూర్వక అభినందనలు : వైయస్ జగన్

by Thanuru Gopichand |   (  Updated:2026-01-04 07:47:55  IST  )

విజన్ వైజాగ్ ను సాధించే దిశగా కీలక అడుగుపడింది.

GMR గ్రూప్‌కు హృదయపూర్వక అభినందనలు : వైయస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Bhogapuram Airport) తొలి కమర్షియల్ విమానం ల్యాండ్ అయ్యింది. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ప్రతిపక్ష, అధికార పక్ష నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం సాకారమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ కూడా శుభ సందర్భం విషయమై స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్టును పబ్లిష్ చేశారు.

విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావ‌డం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి. #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన GMR గ్రూప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లు ఖర్చు చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తైంది. ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన నితిన్ గడ్కరీ గారి కృషి, సహకారం నాకు ఎంతో గుర్తుంది. అని వైయస్ జగన్ తన ఖాతాలో పోస్ట్ చేశారు.

Next Story