తలైవా సింప్లిసిటీకి హ్యాట్సాఫ్.. రజనీకాంత్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు!

by Ramesh Naini |   (  Updated:2026-05-13 05:54:07  IST  )

తమిళ సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

తలైవా సింప్లిసిటీకి హ్యాట్సాఫ్.. రజనీకాంత్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ సూపర్ స్టార్, ప్రముఖ నటుడు రజనీకాంత్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బుధవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో రజనీకాంత్ చేసిన ప్రసంగానికి ముగ్ధుడైన లోకేశ్.. తలైవా సింప్లిసిటీ, ఆయనలోని వినయ విధేయతలను కొనియాడుతూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘రజినీకాంత్ సార్.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆశ్రమంలో మీరు చేసిన సరళమైన, సరదా అయిన, ఎంతో లోతైన ప్రసంగాన్ని వింటూ ఈ రోజు ఉదయం నిద్రలేచాను. ఆ ప్రసంగంలోని ప్రతి మాట నాకు ఎంతో నచ్చింది. మీ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి, అంతటి సూపర్ స్టార్‌డమ్ ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం తలకు ఎక్కించుకోకుండా అంత వినయంగా, హుందాగా ఉండటం నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. కేవలం విజయం సాధించడం గురించే కాకుండా, ఆ విజయంలో కూడా ఎలా ఒదిగి ఉండాలనే విషయం గురించి నేటి యువత మీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒక అభిమానిగా మీకు నా ప్రేమ, ప్రశంసలు’ అని నారా లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..?

మంగళవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం, అలాగే శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రజనీకాంత్.. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌ను గతంలో తాను సందర్శించినప్పటి జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. ఆ ఆశ్రమంలో తన ‘ఇగో’ (అహంకారం) ఎలా దెబ్బతిన్నదో వివరిస్తూ సభికుల్లో నవ్వులు పూయించారు.

‘నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు..’

ఆశ్రమంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ రజనీకాంత్ ఇలా అన్నారు.. ‘ఒకసారి గురుదేవులు (శ్రీ శ్రీ రవిశంకర్) నన్ను తనతో పాటు ఆశ్రమం చూడటానికి రమ్మని పిలిచారు. నేను వస్తే జనాలు గుమిగూడతారని, అది మీకు ఇబ్బందికరం అవుతుందని నేను ఆయనతో చెప్పాను. దానికి ఆయన ‘ఏం పర్వాలేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, రండి’ అని అన్నారు. ఆ సమయంలో అక్కడ తమిళనాడుకు చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు. నేను అక్కడికి వెళ్లగానే సహజంగానే జనాలు నన్ను గుర్తుపడతారని, నా పేరును అరుస్తారని, ఆటోగ్రాఫ్‌లు, ఫోటోల కోసం ఎగబడతారని అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా, అక్కడి వారంతా ఆధ్యాత్మికతలో మునిగిపోయి ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా నా వైపు కన్నెత్తి చూడలేదు. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఆ దెబ్బతో నా ఇగో మొత్తం క్రష్ అయిపోయింది’ అని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక సూపర్ స్టార్, తన గురించి తాను ఇంత సరదాగా, నిజాయితీగా మాట్లాడుకోవడం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేశ్ సైతం ప్రస్తావిస్తూ ఆయన సింప్లిసిటీపై ప్రశంసల జల్లు కురిపించారు.

Next Story