గీతం భూముల క్రమబద్ధీకరణకు జీవీఎంసీ ఆమోదం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 07:27:10  IST  )

జీవీఎంసీ తీరు పట్ల వైసీపీ, కమ్యూనిస్టు పక్షాల ఆగ్రహం.. నిరసన.

గీతం భూముల క్రమబద్ధీకరణకు జీవీఎంసీ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కౌన్సిల్ సమావేశం గీతం భూముల క్రమబద్ధీకరణ అంశంపై తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. ఎటువంటి చర్చ లేకుండానే మేయర్ పీలా శ్రీనివాసరావు అజెండాలోని 15 అంశాలను ఆమోదించడం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా గీతం యూనివర్సిటీకి చెందిన సుమారు 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించే ప్రతిపాదనను వైసీపీ, కమ్యూనిస్టు పార్టీల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశం ప్రారంభానికి ముందే విపక్ష సభ్యులు నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టగా, సంతాప తీర్మానం తర్వాత దీనిపై చర్చిద్దామని మేయర్ సూచించారు. అయితే ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆరోపిస్తూ వైసీపీ కార్పొరేటర్లు పోడియంను చుట్టుముట్టి ధర్నాకు దిగారు.

ఈ క్రమంలో అధికార కూటమి, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో కౌన్సిల్ హాల్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. మేయర్ తీరుకు వ్యతిరేకంగా విపక్ష నేతలు నినాదాలు చేయగా, సభలో గందరగోళం నెలకొంది. నిరసనల మధ్యే అజెండాలోని కీలక అంశాలను ఆమోదించినట్లు ప్రకటించిన మేయర్ పీలా శ్రీనివాసరావు, అనంతరం అక్కడి నుంచి వెనుతిరిగారు. సుమారు రూ. 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే క్రమబద్ధీకరించడం ప్రజా ఆస్తులను దోచుకోవడమేనని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితర నేతలు విమర్శించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జరిగిన ఈ సమావేశం మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story