GGH: వైద్యం చేయడం లేదు.. మెడిసిన్ ఇవ్వడం లేదు

by Disha Web Desk 16 |
GGH: వైద్యం చేయడం లేదు.. మెడిసిన్ ఇవ్వడం లేదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘అనారోగ్యం ఉందని ఆస్పత్రికి వచ్చా. అయితే ఆస్పత్రిలో వైద్యులు పట్టించుకోవడం లేదు. వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి అసలు ట్రీట్మెంట్ చేయడం లేదు. మెడిసిన్ రాలేదని అంటున్నారు. వైద్యం చేయండని అడిగితే డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్ నా ప్రాణాలు కాపాడండి’ ఇది గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగి రోదన.

నాలుగు రోజులుగా ట్రీట్‌మెంట్ చేయని వైద్యులు

మల్లిఖార్జున అనే యువకుడు న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. 10 రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాలుగు రోజుల నుంచి వైద్యులు ట్రీట్‌మెంట్ చేయడం లేదని వాపోతున్నారు. మెడిసిన్ ఇవ్వాలని అడిగితే మెడిసిన్ లేదని, పై నుంచి రావాలని చెబుతున్నారని... మళ్లీ అడిగితే వైద్యులు డిశ్చార్జ్ చేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను నడవలేను. ఒకరి సపోర్ట్ లేకుండా కనీసం వాష్ రూమ్‌కి కూడా వెళ్లలేను. కాళ్లు, చేతులు సహకరించవు. గట్టిగా దేన్నీ పట్టుకోలేను. కాబట్టి నా ప్రాణాలు కాపాడి. నాకు సాయం చేయండి.’ అంటూ సెల్పీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. బయటకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకునే స్థోమత లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇప్పటికైనా స్పందించండి....

ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ వైద్యులు స్పందించి తనకు ట్రీట్మెంట్ చేయాలని వేడుకుంటున్నారు. ఆర్ఎంవో దృష్టికి తీసుకు వెళ్లినా ప్రయోజనం లేదని మల్లిఖార్జున చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ సొంత జిల్లా ఆస్పత్రిలో ఈ దుస్థితి నెలకొనడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story