- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక దోపిడీలో తగ్గేదేలే..!
ప్రభుత్వ విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రజాప్రతినిధులు.

దిశ ప్రతినిధి, బాపట్ల: నిర్మాణ రంగంలో సామాన్యులకు ఇసుకను అందుబాటులో ఉంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీన్ని ప్రజా ప్రతినిధులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వ విధానాన్ని అమలు చేయాల్సిన కలెక్టరు నుంచి మిగతా యంత్రాంగం దాకా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతామని గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి జారీచేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత కలెక్టర్, ఎస్పీలు కనీసం నోరు మెదపడం లేదు. చెక్ పోస్టుల ఏర్పాటు ద్వారా పోలీసులు నిరంతరం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారని రెవెన్యూ అధికారులు చెబుతుంటే, మరోవైపు పోలీసు శాఖ ఎటువంటి చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయలేదని ప్రకటించడం జిల్లా టాస్క్ ఫోర్స్ సమన్వయం ఏపాటిదో స్పష్టమవుతోంది.
ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే..
జిల్లాలోని బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమ దందా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతోపాటు ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నాయి. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా ఇసుక తవ్వేస్తున్నారు. చీరాల ఇసుక దందాలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం ఏర్పడి ఈపురుపాలెం వద్ద ఎంపీ అనుచరుడి జేసీబీని ఎమ్మెల్యే అనుచరులు దగ్ధం చేసిన ఘటన పై రూరల్ పోలీస్ స్టేషన్ లో రాజీ చేయడం కొసమెరుపు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన వారిని వేధించే స్థాయికి పోలీసులు చేరడం దారుణం.
ఇసుక దందా జరుగుతోంది ఇక్కడే..
- వెదుళ్ళపల్లి చెవిటి మూగ హాస్టల్ వెనుక రాయల్ మెరైన్ కంపెనీ సమీపంలోని అసైన్డ్ భూములు.
- బోయినవారిపాలెం లెమన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ సెంటర్ ప్రక్కన సాల్వేషన్ ఆర్మీపేరుతో ఎస్టీలకు ప్రభుత్వం మంజూరు చేసిన అసైన్డ్ భూములు.
- బాపట్ల–చీరాల మండలాల సరిహద్దు ఈపురుపాలెం ఆటోనగర్ సమీపంలోనీ అసైన్డ్ భూములు.
- చీరాల ఇంజనీరింగ్ కాలేజీ వెనుక కొత్తపేట రెవెన్యూ గ్రామ సర్వే నెంబరు 381 అసైన్డ్ భూములు.
- చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని నాయునిపల్లి సర్వే నెంబర్ 59/6బి ఈడీ అటాఛ్డ్ వాన్ పిక్ భూమి.
- పుల్లరిపాలెం పంచాయతీ సర్వే నెంబర్ 179/28 ఈడీ అటాఛ్డ్ వాన్ పిక్ భూమి.
- ఊటుకూరు సుబ్బయ్యపాలెం సమీపంలో అసైన్డ్ భూములు.
- వేటపాలెం రైల్వే బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్ ప్రక్కన కనకనాగార్పమ్మ దేవాలయం డొంక దారి.
- రామన్నపేట రెవెన్యూ గ్రామ సర్వే నెంబరు 25/7, 257/2, 257/2C7, 257/2C8, 257/2C9, 257/2C10
- పందిళ్ళపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబర్లు ఎల్పీ నం. 692 నందు 206-12, 206- 13, 206-14, ఎల్పీ నం.731 నందు 246-3, 246-6, 230/9, 243/5 .
- పందిళ్లమ్మ గుడి దారిలో రైల్వే ట్రాక్ పక్కన సొన పోరంబోకు భూములు.
- చిన్నగంజాం మండలం మోటుపల్లి పంచాయతీ పరిధిలోని అడవీధిపాలెం రెవెన్యూ గ్రామ సర్వే నంబరు 185 అసైన్డ్ భూములు.






