- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులే లక్ష్యం: సీఎంతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉన్న అవకాశాలు, పెట్టుబడులపై చర్చించారు. డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & ఎండీ ఉదయంత్ మల్హోత్రా నేతృత్వంలోని ప్రతినిధి బృందం, ఏవియేషన్, డిఫెన్స్ రంగాల్లో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న కార్యకలాపాలను ముఖ్యమంత్రికి వివరించారు. రక్షణ రంగ తయారీలో తమకున్న సుదీర్ఘ అనుభవం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారు.
అనుకూలమైన పారిశ్రామిక విధానాలు: సీఎం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను వివరించారు. ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు రాష్ట్రంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారుతోందని పేర్కొన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భేటీలో డైనమాటిక్ టెక్నాలజీస్ తరపున పి. చలపతి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సిఎఫ్ఓ), అహిల్యా మల్హోత్రా (జనరల్ మేనేజర్), ఆండ్రియా మిలానీ (ఫౌండర్, స్టూడియో మిలానీ), క్రిస్టినా లిడేగార్డ్ (గ్లోబల్ స్ట్రాటజీ మేనేజర్) పాల్గొన్నారు. ప్రభుత్వ పక్షాన పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఇతర ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.






