ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..! వాట్సాప్‌లో మెడికల్ కౌన్సిల్ సేవలు

by Ramesh Naini |

డిజిటల్ సేవలను విస్తరించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు, వైద్యులకు మరో శుభవార్త అందించింది.

ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..! వాట్సాప్‌లో మెడికల్ కౌన్సిల్ సేవలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిజిటల్ సేవలను విస్తరించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు, వైద్యులకు మరో శుభవార్త అందించింది. పౌర సేవలను మరింత సులభతరం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలను ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రారంభించిన ఈ సదుపాయంతో ఇకపై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే, మొబైల్ ఫోన్‌లో క్షణాల్లో అవసరమైన వైద్య సమాచారాన్ని పొందవచ్చు.

సేవలు పొందే విధానం ఇలా..

అధికారుల సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ ద్వారా ఈ ఏఎంసీ సేవలను యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు ముందుగా తమ ఫోన్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. వాట్సాప్‌లోకి వెళ్లి ఆ నంబర్‌కు ‘Hi’ లేదా ‘హాయ్’ అని మెసేజ్ పంపాలి. వెంటనే వచ్చే ఆటోమేటెడ్ రిప్లైలో ‘ఆరోగ్య శాఖ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ‘AMC సేవలు’ ఎంచుకోవడం ద్వారా మీకు కావాల్సిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

అందుబాటులో ఉన్న సేవలు ఇవే..

ఈ సరికొత్త విధానం ద్వారా వైద్యులకు, సామాన్య ప్రజలకు ఒకే వేదికపై వేర్వేరు సేవలను అందుబాటులో ఉంచారు. సమయానికి సరైన సమాచారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, వైద్య ఆరోగ్య శాఖ డిజిటలైజేషన్‌లో ఒక ముఖ్యమైన అడుగుగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సామాన్య ప్రజల కోసం:

*ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఓపీ (OP) సేవల వివరాలు.

*అత్యవసర సమయాల్లో ఆసుపత్రుల్లో రక్త లభ్యతపై సమాచారం.

*మందుల నిల్వలు మరియు శస్త్రచికిత్సకు అవసరమైన సామగ్రి లభ్యతపై ఆరా తీసే సదుపాయం.

వైద్యుల కోసం:

*రిజిస్ట్రేషన్ వివరాలు, వారి దరఖాస్తుల ప్రస్తుత స్థితి.

*రాబోయే సీఎంఈ (CME - Continuing Medical Education) కార్యక్రమాల సమాచారం.

*వైద్యుల క్రెడిట్ పాయింట్ల వివరాలు.

Next Story